తెలుగుదేశం పార్టీ నాయకులకు కీలక సూచనలు చేసిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీలో సీనియారిటీని గౌరవిస్తామని, సిన్సియారిటీని గుర్తిస్తామని చంద్రబాబు అన్నారు. సీనియారిటీ ఉన్నా ఓటు..
తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారం లోకి తీసుకుని రావడానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గురువారం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే కొందరు నాయకుల విషయంలో తాను అలర్ట్ అయ్యానని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో సీనియారిటీని గౌరవిస్తామని, సిన్సియారిటీని గుర్తిస్తామని చంద్రబాబు అన్నారు. సీనియారిటీ ఉన్నా ఓటు వేయించలేని పరిస్థితే ఉంటే ఏం లాభమన్నారు. ఓట్లు వేయించలేని సీనియర్లు కూడా తమకే ప్రాధాన్యమివ్వాలని కోరితే టీడీపీ ప్రతిపక్షంలోనే ఉండిపోతుందన్నారు. 40 శాతం యువతకు సీట్లిద్దామన్న పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామన్నారు.
కొందరు సీనియర్ నేతల వారసులు రాజకీయాల్లోకి వచ్చారని, ఇంకొందరు ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్నారన్నారు. యువకులనూ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని చంద్రబాబు అన్నారు. పార్టీలో పని చేసే యువ నేతలనూ గుర్తిస్తామని, అవకాశాలిస్తామని స్పష్టం చేశారు. ఒక్క సెకండులోనే 8,700 మంది సభ్యత్వం కోసం అప్రోచ్ అయ్యారని చంద్రబాబు అన్నారు. చంపేసినా ఫర్వాలేదు.. జై జగన్ అనే నినాదం చేయనంటూ చంద్రయ్య అనే కార్యకర్త చనిపోయారని, చంద్రయ్యలాంటి కార్యకర్తలే టీడీపీకి బలమని అన్నారు. నిజమైన కార్యకర్తలకు సరైన గౌరవం లభించడం లేదనే బాధ కొందరిలో ఉందని, ఆ బాధను తప్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏపీకి గత మూడేళ్లల్లో భారీ డామేజ్ జరిగిందని, రాష్ట్రాన్ని పునర్ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు.
ఫీల్డులో పని చేయకుండా మాయ చేసే నేతలకు ఇకపై చెక్ పెట్టనున్నట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు. కొంత మంది నేతలు ఫీల్డులో పని చేయకుండా.. పార్టీ కార్యాలయం చుట్టూ తిరుగుతా ఉంటారన్నారు. ఏదో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు కదా అని తాము కొన్నిసార్లు నమ్ముతామని.. ఇకపై అలాంటి నేతలకు కాలం చెల్లిందని చెప్పారు. ఎవరు పని చేశారు.. ఎవరు తప్పించుకుంటున్నారనేది మానిటర్ చేసే వ్యవస్థ వచ్చిందని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.