దసరా రోజున విడుదల ఇక లేనట్లే
దసరా రోజున రెండో విడత మ్యానిఫేస్టోను విడుదల చేస్తామని చంద్రబాబు చెప్పారు. కానీ అది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తొలి విడత మ్యానిఫేస్టోను విడుదల చేశారు. ఈ ఏడాది మే 28వ తేదీన ఆయన టీడీపీ తొలి మ్యానిఫేస్టోను విడుదల చేస్తూ ఆరు గ్యారంట్లీను ప్రజల ముందు ఉంచారు. మలి విడత మ్యానిఫేస్టో ఉంటుందని అప్పుడే చంద్రబాబు ప్రకటించారు. దసరా రోజున మహిళల సమక్షంలో విడుదల చేస్తామని తెలిపారు. దసరాకు ఇక పెద్దగా సమయం లేదు. ఈ లోపు మ్యానిఫేస్టోను ఓకే చేసి ప్రకటించే అవకాశం లేదన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
అరెస్టయి జైలులో...
స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టయి ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఒకవేళ బెయిల్ వచ్చినా ఇప్పటికిప్పుడు హడావిడిగా మ్యానిఫేస్టోను విడుదల చేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పకడ్బందీగా మ్యానిఫేస్టోను రూపొందించేందుకు స్వయంగా చంద్రబాబు కసరత్తు చేయాల్సి ఉంది. ఈ నెల 24వ తేదీన దసరా కావడంతో ఇంకా పది నుంచి పన్నెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో దసరాకు మలి విడత మ్యానిఫేస్టో సాధ్యం అయ్యే అవకాశాలు లేవు.
తొలి విడత...
తొలి విడత మ్యానిఫేస్టోను మే 28న మహానాడు వేదికగా చంద్రబాబు ప్రకటించారు. ఆరు గ్యారంటీలను ఆయన ప్రజల ముందు ఉంచారు. పేదలను సంపన్నులను చేయడం, బీసీలకు రక్షణ చట్టం, ఇంటింటికీ నీరు, రైతులకు ప్రతి ఏడాదికి పదిహేను వేల ఆర్థిక సాయం, మహాశక్తి పథకం కింద పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా, ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే వీలు కల్పిస్తూ తొలి విడత మ్యానిఫేస్టోను ప్రకటించారు.
పవన్ తో చర్చించి...
మ్యానిఫేస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని భావించే సమయంలో ఆయన స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టయ్యారు. మరో వైపు జనసేనతో పొత్తు కూడా జైలులో ఉన్నప్పుడే అధికారికంగా ఖరారయింది. దీంతో పవన్ కల్యాణ్‌తో కలసి ఆయన మలి విడత మ్యానిఫేస్టోను విడుదల చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. తాను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మ్యానిఫేస్టోపై పవన్ తో చర్చించిన తర్వాతనే విడుదల చేస్తారా? లేదా తాను ముందుగా చెప్పినట్లే దసరా రోజున కొన్ని పథకాలతో రిలీజ్ చేస్తారా? అన్నది చూడాల్సి ఉంది. ఎక్కువ భాగం మ్యానిఫేస్టో విడుదల వాయిదా పడే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి.