జగన్ పని అయిపోయింది.. మళ్లీ అధికారంలోకి రారు.. రాలేరు

ఏపీ రాజకీయ పరిస్థితులు, సీఎం వైఎస్‌ జగన్‌ పాలన, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌ సంచలన

Update: 2023-05-23 09:40 GMT

ఏపీ రాజకీయ పరిస్థితులు, సీఎం వైఎస్‌ జగన్‌ పాలన, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌ సంచలన కామెంట్స్‌ చేశారు. జగన్‌ సర్కార్‌ రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగం పెరిగిపోయిందని మండిపడ్డారు. గత 70 ఏళ్లుగా రెండు సామాజిక వర్గాలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయని ఆరోపించారు. వైసీపీ, టీడీపీ పరిస్థితిని చూసి జనం నవ్వుకుంటున్నారని అన్నారు. వైఎస్‌ జగన్‌ మళ్లీ అధికారంలోకి రారని, ఆయన పని అయిపోయిందని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో అటు కేంద్రంలో, ఇటు ఏపీలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలు కాంగ్రెస్‌ సర్కార్‌ కోసం ఎదురుచూస్తున్నారని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో 120 సీట్లకు తక్కువ కాకుండా కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు చింతా మోహన్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కాపులకు రెండున్నరేళ్లు, ఓబీసీ ఎస్సీలకు రెండున్నారేళ్లు సీఎం పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. జనసేన పార్టీ అధినాయకుడు పవన్‌ కల్యాణ్‌ కూడా చిరంజీవిలా అయోమయంలో పడిపోయారని అన్నారు. పవన్‌ రాజకీయం తెలియదన్నారు.

అప్పట్లో రోశయ్య, కిరణ్‌ కుమార్‌ రెడ్డికి బదులు చిరంజీవి సీఎం కావాల్సి ఉండేనని, అయితే చిరంజీవికి రాజకీయ అనుభవం లేక, రాజకీయ తెలియక సీఎం కాలేదన్నారు. చిరంజీవి తనకు మంచి ఫ్రెండ్‌ అని అన్నారు. అయితే పార్టీ వీడిన వారిని వెనక్కి పిలవనన్నారు. బీజేపీ పాలనలో దేశ పరిస్థితులు ఏ మాత్రం బాగోలేవని, పేదలు ఇంకా పేదలుగానే ఉంటున్నారని అన్నారు. పార్లమెంట్‌ భవనాన్ని మార్చాల్సిన అవసరం లేకపోయినా మార్చారని, రాష్ట్రపతి చేయాల్సిన ప్రారంభోత్సవాన్ని కూడా ప్రధాని మోదీ చేస్తున్నారని మండిపడ్డారు. పేదలను బ్యాంకులు పట్టించుకోవడం లేదని, అదే సమయంలో కార్పొరేట్లకు మాత్రమే రుణాలు భారీగా ఇస్తున్నాయి అన్నారు. 

Tags:    

Similar News