Chandrababu : చివరి నిమిషంలో టిక్కెట్ ఇస్తే ఎలాగయ్యా సామీ... అన్నీ సర్దుకునేలోగానే?

చంద్రబాబు అభ్యర్థులను ఖరారు చేేయడంలో ఆలస్యం చేయడంతో అనేక అనర్థాలు జరుగుతున్నాయని చింతలపూడి క్యాడర్ వాపోతుంది.

Update: 2024-02-14 12:45 GMT

ఒక్కటి మాత్రం నిజం.. టీడీపీ అధినేత చంద్రబాబు చింత‌ల‌పూడి సీటు రిజ‌ర్వ్ అయ్యాక ఎప్పుడూ ఇక్కడ క్యాండిడేట్ విష‌యంలో శీత‌క‌న్ను వేయ‌డ‌మో, నిర్లక్ష్యంగానో, నిర్లిప్తత‌తోనే ఉంటూ వ‌స్తున్నారు. అస‌లు మ‌మూలుగానే చంద్రబాబు క్యాండిడేట్‌ను ఎంపిక చేసే విష‌యంలో ఓ ప‌ట్టాన తేల్చరు. ఇక్కడ చిన్న ఉదాహ‌ర‌ణ కూడా అవ‌స‌రం. 2009 ఎన్నిక‌ల్లో ప్రకాశం జిల్లా క‌నిగిరి నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ క్యాండిడేట్ గా మాజీ ఎమ్మెల్యే క‌దిరి బాబూరావుకు బీఫారమ్ ఇచ్చారు. ఆయ‌న నామినేష‌న్‌లో సంత‌కం చేయ‌క రిజెక్ట్ అయ్యింది. ఆయ‌న‌కు డ‌మ్మీగా కూడా ఎవ్వరూ వేయ‌లేదు. దీంతో అక్కడ టీడీపీకి క్యాండిడేట్ లేకుండా పోయాడు.

వెంట‌నే చేయాల్సిందేంటి..?
పోటీలో ఉన్న ఇండిపెండెంట్లలో ఎవ‌రో ఒక బ‌ల‌మైన పోటీదారో లేదా మ‌న‌కు ఎవ‌రు అనుకూలంగా ఉంటే వారే అక్కడ పార్టీ క్యాండిడేట్ అని చెప్పుకుంటే స‌రిపోతుంది.పార్టీ సింబ‌ల్ ఎలాగూ లేదు.. మిగిలిన ఇండిపెండెంట్లలో ఒక‌రికి స‌పోర్ట్ చేస్తే.. వాళ్ల గెలుపు ఓట‌ములు ఎలా ఉన్నా పార్టీ కేడ‌ర్‌లో ఉత్తేజం రావ‌డంతో పాటు ఎంపీ క్యాండిడేట్‌కు అయినా మంచి ఊపు ఉంటుంది. నామినేష‌న్ల ప‌ర్వం ముగిసి... చివ‌ర‌కు మ‌రో రెండు రోజుల్లో ప్రచారం గ‌డువు ముగిసే వ‌ర‌కు కూడా అక్కడ పార్టీ ఎవ‌రికి స‌పోర్ట్ చేస్తుందో చెప్పనే లేదు. ఎట్ట‌కేల‌కు సుంక‌ర మ‌ధు అనే ఇండిపెండెంట్‌కు పార్టీ కేడ‌ర్‌ను స‌పోర్ట్ చేయమ‌న్నారు. చివ‌ర‌కు ఆయ‌న గుర్తు ప్రజ‌ల్లోకి వెళ్లే టైం కూడా లేదు. కేవ‌లం 2 వేల ఓట్ల తేడాతో పార్టీ ఓడిపోయింది.
చింతలపూడి టిక్కెట్ విషయంలో...
టీడీపీ అధినేత చంద్రబాబు టిక్కెట్ల విష‌యంలో ఎలా నాన్చుతాడో చెప్పేందుకు ఇదే పెద్ద ఉదాహ‌ర‌ణ‌. పార్టీ అధికారంలో ఉండి.. 2019 ఎన్నిక‌ల్లోనూ టిక్కెట్ల విష‌యంలో నాన్చుడే.. ఇప్పుడు కూడా అదే ప‌రిస్థితి. అందులోనూ చింత‌ల‌పూడిని 2009, 2014, 2019 ప్రతి ఎన్నిక‌ల్లోనూ చివ‌రి వ‌ర‌కు నాన్చుతూనే ఉంటారు. దీంతో పార్టీ కేడ‌ర్ కూడా తీవ్ర గంద‌ర‌గోళంతో అభ్యర్థి ఎవ‌రో తెలియ‌క కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. వైసీపీ అభ్యర్థి కంభం విజ‌య‌రాజు ఇప్పటికే ప్రజ‌ల్లోకి దూసుకువెళుతున్నారు. టీడీపీ నుంచి న‌లుగురైదుగురు పోటీలో ఉన్నారు. ఎవ‌రికి వారు తిరుగుతున్నారు. ఇటు కేడ‌ర్‌కు కూడా అస‌లు అభ్యర్థి ఎవ‌రో తెలియ‌ట్లేదు. ఎన్నిక‌ల‌కు మ‌రో రెండు నెల‌ల టైం మాత్రమే ఉంది.
ఎప్పుడూ అంతే...
2009లో చివ‌ర్లో క‌ర్రా రాజురావును పోటీకి దింపారు. ఆయ‌న లోక‌ల్ అయ్యి ఉండి కూడా అప్పటిక‌ప్పుడు ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రాజేష్ చేతిలో ఓట‌మిపాల‌య్యారు. 2014లోనూ చివ‌ర్లో మాజీ మంత్రి పీత‌ల సుజాత‌ను తీసుకువ‌చ్చారు. ఇది అప్పటిక‌ప్పుడు డెసిష‌నే. 2019లో పార్టీ అధికారంలో ఉండి కూడా బ‌ల‌మైన క్యాండిడేట్‌ను ఎంపిక చేయ‌లేదు. చివ‌ర్లో క‌ర్రా రాజారావును దింపగా పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడు కూడా ఎవ‌రో ఒక‌రికి మీదే సీటు అని క్లారిటీ ఇవ్వడం లేదు.
క్యాడర్ లో అయోమయం...
దీంతో టిక్కెట్ రేసులో ఉన్న నేత‌లు, ఇటు ఒక్కొక్కరిని ఎంక‌రేజ్ చేస్తూ గ్రూపులు క‌ట్టేవాళ్లు ఇలా ఎవ‌రి గోల వారిదే అన్నట్టుగా చింత‌ల‌పూడి టీడీపీ ప‌రిస్థితి త‌యారైంది. చివ‌రి 20 రోజుల‌కు ముందు సీటు ఎనౌన్స్ చేస్తే స‌రిపోతుందిలే అన్న నిర్లక్ష్య ధోర‌ణే మ‌ళ్లీ చింత‌ల‌పూడి విష‌యంలో చంద్రబాబుకు ఉన్నట్టుగా ఉంది. ఇక కేడ‌ర్ కూడా అస‌లు ఎవ‌రి వైపు ఉండాలి.. పార్టీ కార్యక్రమాలు ఎలా చేయాలో తెలియ‌క టెన్షన్‌గా ఉంది. ఏదేమైనా చంద్రబాబు చింత‌ల‌పూడి టీడీపీ టిక్కెట్ విష‌యంలో త్వర‌గా క్లారిటీ ఇచ్చేయాల‌ని ఇక్కడ కేడ‌ర్ బ‌లంగా కోరుకుంటోంది


Tags:    

Similar News