ఎవరు.. ఎవరికి.. బి టీమ్?
తెలంగాణలో ఎన్నికల రాజకీయం బాగా వేడెక్కింది. అధికారం కోసం అర్రులు చాస్తున్న కాంగ్రెస్, బీజేపీ.. కేసీయార్ ప్రభుత్వంపై..
భారాస 'బి' టీం అంటూ కమలం, కాంగ్రెస్ పరస్పరం ఆరోపణలు
తెలంగాణలో ఎన్నికల రాజకీయం బాగా వేడెక్కింది. అధికారం కోసం అర్రులు చాస్తున్న కాంగ్రెస్, బీజేపీ.. కేసీయార్ ప్రభుత్వంపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. ఎన్నికల్లో ఓడిపోతే మరో ఐదేళ్లపాటు వేచి చూడాల్సిందే కాబట్టి, భాజపా, కాంగ్రెస్‌లు ఈ సారి గెలుపు అవకాశాల్ని వదిలి పెట్టాలనుకోవడం లేదు.
తెలంగాణలో ముక్కోణపు పోటీ ఏదో ఓ పార్టీ పుట్టి ముంచనుంది. కాంగ్రెస్, భాజపాలు తమతో పోటీ పడితే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి ముచ్చటగా మూడోసారి అధికార పీఠాన్ని అధిరోహించవచ్చని కేసీయార్ పార్టీ భావిస్తోంది. భాజపా దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి భారాస మహారాష్ట్రలో రాజకీయం ప్రారంభించింది. శనివారం కేసీయార్ సమక్షంలో చాలామంది భారాసలో చేరారు. అయితే వాళ్లు ఎంతవరకూ రాజకీయంగా ఉపయోగపడతారనేది ఎన్నికల్లో కానీ తేలదు.
తెలంగాణలో అధికార పార్టీకి తామే ప్రత్యర్థులమని నిరూపించడానికి భాజపా, కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలో రాష్ట్రంలో రెండు పార్టీల కీలక నేతలు పర్యటించారు. తొలుత కాంగ్రెస్ వారసుడు రాహుల్‌గాంధీ ఖమ్మం సభలో పాల్గొని ఆ పార్టీ క్యాడర్‌లో జోష్ నింపారు. భారాసను బీజేపీకి ‘బి’ టీమ్‌గా ఆయన అభివర్ణించారు. గులాబీ పార్టీని భాజపా రిస్తేదార్ సమితి అంటూ కొత్త పదాన్ని సృష్టించారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్యయ్య కూడా భారాస, భాజపా మధ్య రహస్య అవగాహన కుదిరిందని ఆరోపించారు. రాజకీయంగా విమర్శలు చేసుకుంటున్నా, కీలక విషయాల్లో ఆ రెండు పార్టీ మధ్య ‘ఒప్పందాలు’ ఉన్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ కాకపోవడం, ప్రతిపక్షాల మీటింగ్‌కు భారాస నుంచి ఎవ్వరూ హాజరు కాకపోవడాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు.
ఇక ఈ వారంలోనే స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించారు. ఆరు వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కెసిఆర్ కుటుంబ అవినీతిపై ఆయన ధ్వజమెత్తారు. లిక్కర్ స్కాంలో ఆప్‌తో కలిసి అవినీతికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా భాజపా నాయకులు భారాస, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయని విమర్శలు ఎక్కుపెట్టారు. గులాబీ పార్టీ.. కాంగ్రెస్‌కు బీ టీమ్ అని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్ విమర్శించారు. భారాస నేతలు ఇటీవలే రేవంత్ రెడ్డిని కలిశారని రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ఆ రెండు పార్టీల మధ్య అవగాహనకు ఇదే నిదర్శనమని ఆయన వెల్లడిరచారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బారిన పడకుండా భాజపా, కాంగ్రెస్ రెండూ భారాసను ప్రత్యర్థి పార్టీలకు బీ టీమ్ గానే ఆరోపిస్తున్నాయి.