AP Congress : ఒంటరిపోరు.. అందుకే ముందస్తు చర్యలు.. అభ్యర్థుల జాబితాపై?
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలిసింది. కొన్ని స్థానాలకు సీనియర్ నేతలను ఎంపిక చేసింది
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేసినట్లు తెలిసింది. కొన్ని ముఖ్యమైన స్థానాలకు సీనియర్ నేతలను ఎంపిక చేసినట్లు సమాచారం. ఏపీలో కనీసం కొన్ని స్థానాల్లోనైనా గెలవాలన్న నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే కొందరు నేతలకు సంకేతాలను పంపుతుంది. పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని ముఖ్య నేతలకు సమాచారం అందడంతో నేతలు ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లో త్వరలో పర్యటనలను చేసేందుకు లీడర్లు రెడీ అవుతున్నారు. ముఖ్య నేతలు అందరూ పార్లమెంటు ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపు రావడంతో కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనపడుతుంది. వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్ గా బాధ్యతలను చేపట్టేలోగానే ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పార్టీ అధినాయకత్వం ఉంది.
ఎవరూ కలసి రారని...
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని ఎవరూ కలుపుకుని పోయే ప్రయత్నం చేయరు. ఒంటరిగానే బరిలోకి దిగాల్సి ఉంటుంది. వస్తే.. గిస్తే.. కమ్యునిస్టులు.. అదీ టీడీపీ కూటమితో బీజేపీ జట్టుకట్టకుండా ఉంటేనే వామపక్ష పార్టీలు కాంగ్రెస్ తో కలుస్తాయి. లేదంటే అది టీడీపీతోనే కలసి వెళతాయి. కమ్యునిస్టులు తప్ప మరే పార్టీ కాంగ్రెస్ తో కలిసేందుకు సిద్ధపడవు. అందుకే ఒంటరి పోరుకే సిద్ధమవుతుంది. ఇప్పటి నుంచే పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటనలు చేసి ప్రజలను కలుసుకుంటూ వెళితే కొంత మేర అనుకూల ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు. అందుకోసమే సీనియర్ నేతల పేర్లను అనధికారికంగా ఖరారు చేసినట్లు తెలిసింది.
వీరే ఖరారయినట్లు...
బాపట్ల నియోజకవర్గం నుంచి జేడీ శీలం, తిరుపతి నియోజకవర్గం నుంచి చింతా మోహన్, నరసాపురం నియోజకవర్గం నుంచి కనుమూరి బాపిరాజు, కాకినాడ నియోజకవర్గం నుంచి పల్లంరాజు, విశాఖపట్నం నుంచి టి. సుబ్బిరామిరెడ్డి, కడప పార్లమెంటు నుంచి వైఎస్ షర్మిల పేర్లు దాదాపు గా ఖరారయ్యాయని చెబుతున్నారు. వీరికి ఇప్పటికే సమాచారం అందడంతో వారు నియోజకవర్గాల్లో పర్యటనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. గెలుపోటములు ముఖ్యం కాదని, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పర్యటనలు ఉండాలని ఏఐసీసీ నుంచి నేతలకు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. పార్లమెంటు నియోజకవర్గాల్లో కొంత పట్టు సాధించగలిగితే తర్వాత అసెంబ్లీ అభ్యర్థుల ఎన్నిక చూడవచ్చని భావిస్తున్నారు.
రాహుల్ పర్యటనతో...
ప్రధానంగా తమ ప్రచారంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని చెప్పడంతో పాటు వెనుకబడిన రాష్ట్రాలకు అభివృద్ధి నిధులతో పాటు రాష్ట్ర విభజనలోని అంశాలన్నీ నెరవేరుస్తామని ప్రజలకు చెప్పనున్నారు. రాహుల్ గాంధీ కూడా విశాఖపట్నం, విజయవాడ, కడప ప్రాంతాల్లో ఎన్నికల సమయంలో పర్యటించేందుకు ఓకే చెప్పారని తెలిసింది. ప్రియాంక గాంధీ కూడా అనేక నియోజకవర్గాల్లో రోడ్ షోలో పాల్గొనేలా ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. మొత్తం మీద హస్తం పార్టీ ముందుగా పార్లమెంటు నియోజకవర్గాలపై కన్నేసింది. అందుకే ముందుగా అక్కడ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడింది.