Congress : వీళ్లు మారరు అంతే...వీళ్లకు ఓటేసి తప్పు చేశామా?

కాంగ్రెస్ హైకమాండ్ ఈరోజు ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించే అవకాశాలున్నాయి

Update: 2023-12-05 03:42 GMT

కాంగ్రెస్ మారుతుందనుకోవడం భ్రమే. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయడానికి ఎన్ని కసరత్తులు. ఎన్ని ప్రయత్నాలు. హైకమాండ్ సూచించిన పేరును కొందరు ఆమోదిస్తారు. మరికొందరు విభేదిస్తారు. పైకి అతి గొప్ప ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్నప్పటికీ చూసే వాళ్లకు విసుగు తెప్పించేలా ఉంటంది. అసలు ఈ పార్టీకి ఎందుకు ఓటు వేశామా? అని మధనపడే స్థాయికి ప్రజలను తీసుకు వచ్చేంత వరకూ వీళ్లింతే. మారరు. పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్నామన్న స్పృహ కూడా లేదు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలన్న కనీస పరిజ్ఞానం కూడా కొరవడదు. ప్రతి నేత తాను తోపు అనుకుంటాడు. తనవల్లనే గెలుపు సాధ్యమయిందని భ్రమిస్తాడు. అదే కాంగ్రెస్ లో వచ్చిన తంటా.

ఎవరైతే ఏంటంట?
ఎవరో ఒకరు.. ముఖ్యమంత్రి పదవి చేపడితే ఏమౌవుతుంది. అహ... అందుకు అహం అంగీకరించదు. తాము పార్టీని గెలిపిస్తే వేరే వాళ్లకు ఎలా ఇస్తారని వెంటనే ప్రశ్న. ఒకరి పేరు గట్టిగా వినిపిస్తేచాలు.. అప్పటి వరకూ శత్రువులుగా ఉన్న వాళ్లంతా ఏకమై ఆ నేత ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేయవద్దని చెబుతారు. అసలే... బొటాబొటీ సీట్లతో అధికారంలోకి వచ్చామన్న స్పృహ కూడా లేదు. ఇలాంటి పోకడల వల్ల కొత్తగా ఎమ్మెల్యేలు విసుగుపెట్టి పక్క చూపులు చూస్తే అసలుకే నష్టం వాటిల్లుతుందన్న ఆలోచన కూడా ఉండదు. ఎవరు గెలుపునకు కారణమో స్పష్టంగా తెలుసు. ఎవరు కష్టపడ్డారో అందరికీ తెలుసు. కానీ పది మందికి ముఖ్యమంత్రి పదవి రాదు. ఎవరో ఒకరికే వస్తుందని తెలుసు. అయినా ఆగమాగం చేస్తారు.
ఢిల్లీకి నేతలు...
ఎక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిని తమను కాదని ప్రకటిస్తారోనని ఢిల్లీకి కొందరు నేతలు బయలుదేరి వెళ్లారు. ఢిల్లీకి భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి బయలుదేరి వెళ్లారు. మల్లికార్జున ఖర్గేతో సమావేశం కానున్నారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి పంచాయతీ ఢిల్లీకి చేరింది. మధ్యాహ్నానికి గాని పార్టీ ఇన్‌ఛార్జి థాక్రే, డికే శివకుమార్ సమావేశం కారు. ఆ తర్వాత ఏం చేయాలన్న దానిపై నిర్ణయిస్తారు. కానీ ఈలోపు నేతలు ఢిల్లీకి వెళ్లి అడ్డుపుల్లలు వేయడానికి సిద్ధమవుతున్నారు. కొందరు సీనియర్ నేతలు ఢిల్లీకి వెళ్లి రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేయవద్దంటూ ఖర్గేను కలవాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.
సీల్డ్ కవర్ లో....
అధినాయకత్వ మాత్రం సీల్డ్ కవర్ లో ముఖ్యమంత్రి పేరును పంపే అవకాశముంది. రేపు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేలా నిర్ణయం వెలువడనుంది. సీఎం ఎవరన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఫలితాలు వచ్చి మూడు రోజులవుతున్నా ఇంకా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది నిర్ణయించకపోవడాన్ని కార్యకర్తలు తప్పుపడుతున్నారు. ఇలా వచ్చిన వారిని ఎంటర్‌టైన్ చేస్తూ హైకమాండ్ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే జరగాల్సిన నష్టం జరిగిపోతుందన్న బాధ కిందిస్థాయి క్యాడర్ లో ఉంది. క్యాడర్ కష్టపడి ప్రాణాలొడ్డి గెలిపిస్తే నేతలు పదవుల కోసం పోటీ పడుతూ వీధినపడుతుండటం ఒక్క కాంగ్రెస్ కే చెల్లుతుంది. అందుకే కాంగ్రెస్ ను పదేళ్లు దూరంగా ఉంచినా.. షరామామూలే.. వీళ్లు... మారరు. అంతే.


Tags:    

Similar News