'ప్రధాని పదవిపై కాంగ్రెస్‌కు ఆసక్తి లేదు'.. ఖర్గే ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్

కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంపైనా లేదా ప్రధానమంత్రి పదవిపైనా కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి ఆసక్తి

Update: 2023-07-18 12:04 GMT

కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంపైనా లేదా ప్రధానమంత్రి పదవిపైనా కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి ఆసక్తి లేదని వెల్లడించారు. అధికారంలోకి రావడం తమ ఉద్దేశ్యం కాదన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికత్వాన్ని, సామాజిక న్యాయాన్ని పరిరక్షించడమే తమ ధ్యేయమని ఖర్గే పేర్కొన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా బెంగళూరులో రెండోరోజు విపక్షాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే ప్రసంగించారు. రాష్ట్ర స్థాయిలో తమలో కొన్ని విభేదాలు ఉన్న మాట వాస్తవమేనన్నారు. అయితే అవి సిద్ధాంతపరమైనవి కావని గుర్తించాలన్నారు.

ఇవేవీ దేశం ఎదుర్కొంటున్న సమస్యల ముందు పెద్ద విషయాలు కావని అన్నారు. తాము 26 పార్టీలకు చెందిన వారమని ఖర్గే అన్నారు. 11 రాష్ట్రాల్లో తమ పార్టీలు అధికారం సాగిస్తున్నాయని అన్నారు. బీజేపీ సొంతంగా 303 లోక్‌సభ సీట్లు సాధించుకోలేదన్నారు. మొదట ఓట్ల కోసం మిత్రపక్షాలతో కలిసి పని చేసి, అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని బీజేపీ వదిలేస్తుందని ఖర్గే ఆరోపించారు. ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడితోపాటు ఆయా రాష్ట్రాల బీజేపీ నేతలు పాత మిత్రుల కోసం వివిధ రాష్ట్రాల్లో పరుగులు పెడుతున్నారని ఖర్గే విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ చాలా ముఖ్యమని, అయితే దానిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాశనం చేస్తోందని ఖర్గే ఆరోపించారు.

ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్ష నేతలపై దాడులు చేస్తోందన్నారు. దేశ ప్రయోజనాల పరిరక్షణకు అందరూ కలిసి కట్టుగా ఉండాలన్నారు. అందుకే తామంతా ఒక్కటయ్యమన్నారు. పాట్నా సమావేశంలో 16 పార్టీలు పాల్గొంటే.. నేటి సమావేశంలో 26 విపక్ష పార్టీలు పాల్గొన్నాయన్నారు. ప్రతిపక్షాలను చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారని ఖర్గే అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించటమే ఏకైక లక్ష్యంగా వరుసగా రెండో రోజు విపక్షాలు సమావేశమయ్యాయి. బెంగళూరులోని తాజ్‌ వెస్ట్‌ఎండ్‌ హోటల్‌లో మంగళవారం ఉదయం ప్రతిపక్ష పార్టీల నేతలు భేటీ అయ్యారు.

Tags:    

Similar News