కాంగ్రెస్‌లో కొత్త రూల్... అమలయ్యే ఛాన్సే లేదు..!
ఇది తెలంగాణలో మాత్రం అమలయ్యే అవకాశమే లేదు. ఒక్క కుటుంబానికి ఒక్క టిక్కెట్ అంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో..
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా వరుస ఓటములతో కుదేలవుతున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇటీవల ఢిల్లీలో కీలక సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నడుస్తున్న తీరు, నడవాల్సిన పద్ధతి, భవిష్యత్ కార్యాచరణ వంటివన్నీ ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో చర్చించారు. అయితే, పార్టీ టిక్కెట్ల కేటాయింపునకు సంబంధించి ఒక కొత్త నిబంధనను తీసుకురావాలని ఈ సమావేశంలో నిర్ణయం జరిగింది. ఒక్క కుటుంబానికి ఒక్క టిక్కెట్ మాత్రమే ఇవ్వాలనేది ఈ నిర్ణయం సారాంశం.
ఇప్పటి నుంచి జరిగే ప్రతీ ఎన్నికల్లోనూ ఈ నిబంధన అమలు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఇది తెలంగాణలో మాత్రం అమలయ్యే అవకాశమే లేదు. ఒక్క కుటుంబానికి ఒక్క టిక్కెట్ అంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెద్ద నేతలుగా ఉన్న చాలా మందికి గట్టి దెబ్బ పడుతుంది. వచ్చే ఎన్నికల్లో వారి కుటుంబసభ్యుల్లో ఎవరిని పోటీ చేయించాలి అనే అంశానికి సంబంధించి ఇప్పటికే కొందరు కాంగ్రెస్ కీలక నేతలు మంచి స్కెచ్ వేసి పెట్టుకున్నారు. మరి, ఈ నిబంధన అమలైతే వారి ప్లాన్‌లన్నీ బెడిసికొడతాయి.
ఈ నిబంధన ముందుగా పీసీసీ మాజీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిపైన ఎఫెక్ట్ చూపిస్తుంది. హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాలు ఉత్తమ్ చేతుల్లో ఉన్నాయి. గత రెండు ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుంచి ఉత్తమ్, కోదాడ నుంచి ఆయన భార్య పద్మావతి పోటీ చేశారు. ఈ సారి కూడా ఇలానే పోటీ చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అనధికారికంగా ఇప్పటికే ప్రకటించేశారు. మరి, కుటుంబానికి ఒకే టిక్కెట్ అంటే కోదాడను ఆయన వదులుకోవాల్సి ఉంటుంది.
ఇక, కాంగ్రెస్‌లో మరో కీలక కుటుంబం కోమటిరెడ్డి బ్రదర్స్‌ది. 2009 నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ప్రతీసారి ఇద్దరూ పోటీలో ఉంటున్నారు. ఇప్పుడు కూడా ఒకరు ఎంపీగా, మరొకరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అంతేకాదు, స్థానిక సంస్థల ఎన్నికల్లో వీరి మరో సోదరుడు మోహన్ రెడ్డిని జెడ్పీటీసీగా పోటీ చేయించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మీ పోటీ చేశారు. మరి, కొత్త నిబంధనల అమలులోకి వస్తే ఒక్క టిక్కెట్ అంటే వీరిలో ఎవరో ఒకరే పోటీ చేయాల్సి వస్తుంది.
అయితే, ఉత్తమ్ దంపతులు, కోమటిరెడ్డి సోదరులు తమ సిట్టింగ్ స్థానాలు కాబట్టి మళ్లీ పోటీ చేస్తామని, ఈ నిబంధన తమకు వర్తించదని చెప్పవచ్చు. కానీ, మరికొందరికి మాత్రం ఈ అవకాశం కూడా లేదు. రేవంత్ రెడ్డి ఈసారి కొడంగల్ నుంచి కాకుండా వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. కొడంగల్ నుంచి ఆయన తమ్ముడిని పోటీ చేయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆ అవకాశం ఉండదు.
వరంగల్‌లో కొండా దంపతులు తమకు వరంగల్ ఈస్ట్‌తో పాటు భూపాలపల్లి లేదా పరకాల సీటు కావాలని అంటున్నారు. వీరికి కూడా ఒకే సీటు వస్తుంది. అయితే, ఈ నేతలంతా రాజకీయంగా బలవంతులు. రెండు సీట్లు తీసుకొని కూడా గెలుచుకొని చూపించిన వారు. ఆయా నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులను పెట్టడం కంటే వీరు పోటీ చేస్తేనే కాంగ్రెస్‌కు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో కొత్త నిబంధన తెలంగాణలో అమలయ్యే అవకాశాలే లేవు.