కలయిక ఎప్పటి వరకూ?
స్టేషన్‌ఘన్‌పూర్ లో బీఆర్ఎస్ నేతల మధ్య నెలకొన్న విభేదాలు సమసిపోయాయి. ఇద్దరు ప్రధాన శత్రువులు ఏకమయ్యారు.
స్టేషన్‌ఘన్‌పూర్ లో బీఆర్ఎస్ నేతల మధ్య నెలకొన్న విభేదాలు సమసిపోయాయి. ఇద్దరు ప్రధాన శత్రువులు ఏకమయ్యారు. ప్రగతి భవన్ లో ఇది జరిగింది. స్టేషన్ ఘన్‌ఫూర్ ఎమ్మెల్యే రాజయ్య, మాజీ మంత్రి కడియం శ్రీహరిలను ప్రగతి భవన్ కు పిలిపించిన కేటీఆర్ వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను దిశానిర్దేశం చేశారు. కలసి పనిచేయాలని సూచించారు. రాజయ్యకు భవిష్యత్‌లో పార్టీ మంచి అవకాశం కల్పిస్తుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో రాజయ్య, కడియం శ్రీహరి ఒకరినొకరు చేతులు కలుపుకున్నారు.
ప్రగతి భవన్‌లో...
వచ్చే ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్ లో కడియం శ్రీహరి విజయానికి కృషి చేస్తానని రాజయ్య చెప్పారు. దీంతో ఇద్దరి మధ్య నెలకొన్న వివాదాలు సమసి పోయినట్లయింది. ఇద్దరూ ఏకమైతే మరోసారి స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఇద్దరికీ బలమైన వర్గాలుండటం వల్ల ఇద్దరూ కలసి పనిచేస్తే ప్రత్యర్థులను సులువుగా ఓడించగలమని ఆ పార్టీ క్యాడర్ కూడా నమ్ముతుంది. ఈ నేపథ్యంలో వారి కలయిక ప్రాధాన్యత సంతరించుకుంది.
పాతుకుపోయినా...
స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో రాజయ్య పాతుకుపోయారు. 2009 నుంచి రాజయ్య గెలుపును ఎవరూ ఆపలేకపోయారు. వరసగా నాలుగు ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. 2014లో గెలిచిన రాజయ్యకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవితో పాటు కీలకమైన వైద్య ఆరోగ్యశాఖ అప్పగించారు. అయితే అవినీతి ఆరోపణలపై ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించారు. అయినా 2018లో రాజయ్యకే తిరిగి గులాబీ బాస్ టిక్కెట్ ఇవ్వడం, ఆయన గెలవడం జరిగిపోయింది. మరోవైపు ఆయనపై ఇటీవల మహిళ సర్పంచ్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా వైరల్ గా మారాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో రాజయ్యకు టిక్కెట్ ఇవ్వకుండా కేసీఆర్ కడియం శ్రీహరిని అభ్యర్థిగా ప్రకటించారు.
ఎన్నికల వరకూ...
అభ్యర్థిని ప్రకటించిన వెంటనే వ్యతిరేకించిన రాజయ్య ఇతర పార్టీల వైపు వెళ్లేందుకు కూడా సిద్ధమయినట్లు వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ హయాంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదర రాజనర్సింహను కలిసినట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా శత్రువులుగా ఉన్న ఇద్దరినీ ఏకం చేశారు. కడియం శ్రీహరి 1994, 1999లో ఇదే నియోజకవర్గం నుంచి గెలిచారు. ఒకవేళ గెలిస్తే కడియం శ్రీహరి దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత తిరిగి స్టేషన్ ఘన్‌పూర్ లో ఎమ్మెల్యే అయినట్లు. వీరిద్దరి కలయిక ఎన్నికల వరకూ కొనసాగుతుందా? లేక ప్రగతి భవన్‌కే పరిమితం అవుతుందా? అన్నది చూడాల్సి ఉంది.