Danam Nagender : దానంకు దక్కిన హామీ అదేనా? అదే దొరికితే ఇక కాదనేదేముంది?

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి లభించిన హామీపై ఇప్పుడు చర్చ జరుగుతుంది

Update: 2024-03-22 11:46 GMT

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి లభించిన హామీపై ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఇటీవల జరిగిన ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయనపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ స్పీకర్ కు వినతి పత్రాన్ని కూడా అందచేసింది. ఒక పార్టీపై గెలిచి మరొక పార్టీలోకి మారడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని కూడా చెబుతున్నారు.

ఎంపీ అభ్యర్థిగా...
కానీ కాంగ్రెస్ ఆలోచన వేరే విధంగా ఉంది. దానం నాగేందర్ చేత ఖైరతాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఆయనకు ఇప్పటికే సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి అభ్యర్థిగా ప్రకటించింది. దానం నాగేందర్ ఖైరతాబాద్ నియోజకవర్గానికి రాజీనామా చేస్తే తిరిగి ఉప ఎన్నిక జరుగుతుంది. అప్పుుడు అది కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తుంది. ఈసారి అక్కడ బలమైన అభ్యర్థిని బరిలోకి దింపి ఖైరతాబాద్ ను సొంతం చేసుకుని శాసనసభలో తమ సంఖ్యను పెంచుకోవాలన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఒక్కొక్కటి పెంచుకుంటూ ఎవరూ ప్రభుత్వాన్ని కూల్చేయకుండా చేయాలన్న వ్యూహంలో కాంగ్రెస్ ఉంది.
ఎంఐఎంతో సఖ్యత...
ిిగత ఎన్నికల పరిస్థితి వేరు. అప్పుడు ఎంఐఎం తమతో కలసి లేదు. ఇప్పుడు ఎంఐఎం కాంగ్రెస్ తో సఖ్యతగా ఉంది. అందుకే ఖైరతాబాద్ లాంటి నియోజకవర్గాన్ని సులువుగా గెలుచుకోవచ్చన్న ఉద్దేశ్యంతో ఉంది. ఎంఐఎం మద్దతుతో ఖైరతాబాద్ ను తమ ఖాతాలో వేసుకుంటే తమ బలం 65కు పెరుగుతుంది. దీంతో పాటు నాగేందర్ ను ఎంపీగా పోటీ చేయిస్తే బలమైన అభ్యర్థి అవుతాడని కూడా అనుకుంటోంది. ఒకవేళ నాగేందర్ అనుకోని పరిస్థితుల్లో ఓటమి పాలయితే ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి కూడా ఒప్పందం కుదిరింది. ఎమ్మెల్సీగా తీసుకుని కేబినెట్ లోకి తీసుకుంటామన్న హామీ కూడా నాగేందర్ కు ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవి నుంచి తప్పుకుని ఎంపీగా పోటీ చేయడానికి అంగీకరించారంటున్నారు.
విడతల వారీగా...
రేవంత్ రెడ్డి నుంచి మాత్రమే కాకుండా పార్టీ హైకమాండ్ ద్వారా కూడా దానం నాగేందర్ కు స్పష్టమైన హామీ లభించడంతోనే ఆయన ఎంపీగా పోటీచేస్తున్నారని చెబుతున్నారు. అదీ కాకుండా గత ఎన్నికల్లో హైదరాబాద్ నగరం నుంచి కాంగ్రెస్ కు ప్రాధాన్యత లేకపోవడం కూడా నాగేందర్ ను పార్టీలోకి తీసుకోవడం ఒక కారణంగా చెబుతున్నారు. త్వరలో జరగనున్న కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఖైరతాబాద్ లోనూ గెలిచి క్రమంగా నగరంపై పట్టు సాధించాలన్న యత్నంలో కాంగ్రెస్ ఉంది. అందుకే విడతల వారీగా ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకునే ప్లాన్ ను రేవంత్ రెడ్డి రెడీ చేసినట్లు తెలిసింది.


Tags:    

Similar News