Killi Kruparani : పార్టీలోనే ఉంటారా? ఇక వేస్ట్ అని బయటకు వచ్చేసి తన దారి తాను చూసుకుంటారా?

మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణికి ఈసారి కూడా నిరాశ ఎదురయింది. ఆమె వైసీపీలోకొనసాగుతారా? లేదా? అన్నచర్చ జరుగుతుంది

Update: 2024-01-12 14:27 GMT

ఎందుకో కాని కొందరికి లక్ అంతగా ఉండదు. కలసి రాదు కూడా. అన్నీ ఉన్నప్పటికీ అదృష్టం తలుపు తట్టకపోతే రాజకీయంగా ఏ మాత్రం ఎదగలేని పరిస్థితి. అధికార పార్టీలో ఉన్నామని చెప్పుకోవడం మినహా పదవులను ఎంజాయ్ చేసేందుకు వీలుండదు. అలాంటి నేతల్లో మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి ఒకరు. ఎందుకంటే.. ఆమె ఒకేసారి గెలిచినా ఏకంగా కేంద్ర మంత్రి అయ్యారు. అందులోనూ శ్రీకాకుళం జిల్లాలో తిరుగులేని కుటుంబంగా ఉన్న ఎర్రన్నాయుడును ఓడించగలిగారు. దీంతో ఆమె జెయింట్ కిల్లర్ గా గుర్తింపు పొందారు. ఎర్రన్నాయుడును ఓడించిన కారణంగానే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కిల్లి కృపారాణికి కేంద్ర మంత్రి పదవి దక్కింది.

వైసీపీలో చేరినా...
కిల్లి కృపారాణి వృత్తి రీత్యా డాక్టర్. ఆమె పలు ప్రయివేటు వైద్యశాలలను నిర్వహిస్తున్నారు. ఆమె భర్త కూడా వైద్యుడే కావడంతో అందరికీ సుపరిచితులే. పైగా కళింగ సామాజికవర్గం కావడతో ఆమెను ప్రజలు కూడా ఆదరించారు. రాష్ట్ర విభజన తర్వాత కొంత కాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగినా ఆ తర్వాత వైసీపీలో చేరిపోయారు. వైసీపీ అధికారంలోకి వచ్చింది. గత ఎన్నికల్లోనూ కిల్లి కృపారాణికి అటు పార్లమెంటు, ఇటు అసెంబ్లీ సీటు దక్కలేదు. అయినా ఆమె పార్టీలోనే ఉండిపోయారు. జగన్ తనను ఆదరిస్తారని, ఏదో ఒక పదవి అప్పచెబుతారని ఆమె ఎదురు చూస్తూనే ఉన్నారు. రాజ్యసభ పదవి వస్తుందని ఆశించినా అది కూడా దక్కలేదు.
ఆశలు లేవ్...
ఇక వచ్చే ఎన్నికల్లో మరోసారి కింజారపు కుటుంబాన్ని ఎదుర్కొనేందుకు కిల్లి కృపారాణిని రంగంలోకి దించుతారని అందరూ భావించారు. ఆమె కూడా అదే ఆశలు పెట్టుకున్నారు. కానీ నిన్న వైసీపీ విడుదల చేసిన జాబితాలో శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా పేరాడ తిలక్ ను అధినాయకత్వం ప్రకటించింది. దీంతో మరోసారి కిల్లి కృపారాణి ఆశలు గల్లంతయ్యాయి. టెక్కలి స్థానం కూడా దువ్వాడ శ్రీనివాస్ కు కేటాయించడంతో అసెంబ్లీ దారులు కూడా మూసుకుపోయినట్లేనని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. దీంతో కిల్లి కృపారాణి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది సిక్కోలు రాజకీయాల్లో చర్చ జరుగుతుంది.
రాజ్యసభకు కూడా...
అయితే త్వరలో మూడు రాజ్యసభ పదవులు ఖాళీ అవుతున్నాయి. అయితే అందులో కొన్ని పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఆ పదవులకు కూడా కిల్లి కృపారాణి పేరును అధినాయకత్వం పరిశీలించడం లేదన్న విషయం అర్థమయింది. ఆమెకు వేరే దారి లేదు. టీడీపీలో కూడా చోటు లేదు. ఇక వైఎస్ షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపడితే అందులోకి వెళతారా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే కిల్లి కృపారాణి మాత్రం ఇంత వరకూ స్పందించలేదు. ముఖ్య అనుచరులతో సమావేశమైన తర్వాత తన భవిష‌్యత్ నిర్ణయాన్ని ప్రకటిస్తారని చెబుతున్నారు. కిల్లి కృపారాణి పార్టీ మారతారా? లేక వైసీపీలోనే ఉండి పదవుల కోసం ఎదురు చూస్తారా? అన్నది మాత్రం తేలాల్సి ఉంది. మొత్తం మీద ఈ మాజీ కేంద్ర మంత్రికి మాత్రం ఫ్యాన్ లో ఉక్కపోత తప్పడం లేదు.


Tags:    

Similar News