Galla Jayadev : గల్లా జయదేవ్ ప్రకటన అందుకేనట.. అది జరగకుంటే ఈసారి కూడా పోటీ చేసేవారట
గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ రాజకీయాలకు బ్రేక్ ఇచ్చారు
గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ రాజకీయాలకు బ్రేక్ ఇచ్చారు. అయితే బ్రేక్ ఎంత కాలం? అన్నది మాత్రం తెలియదు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని మాత్రం ఆయన స్పష్టంగా చెప్పారు. తాను రాజకీయాలను కొంతకాలం పక్కన పెట్టి వ్యాపారాలను చూసుకుంటానని చెప్పేశారు. అయితే గల్లా జయదేవ్ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం తన పరిశ్రమలపై దాడులు చేయడమేనని కొందరు నెట్టింట పోస్టులు పెడుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి భయపడి గల్లా జయదేవ్ మాత్రం రాజకీయాల నుంచి పక్కకు తప్పుకోలేదట. అందుకు బలమైన కారణాలున్నాయని చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వ సంస్థల దాడులతో...
గల్లా జయదేవ్ కంపెనీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు జరగడం ప్రధాన కారణమన్న వాదన వినిపిస్తుంది. ఆయన పరిశ్రమలపై కేంద్ర ప్రభుత్వ సంస్థలు వరస దాడులు జరుగుతుండటంతో ఆయన కొంత వెనక్కు తగ్గారు. ప్రశ్నించినందుకే తనను లక్ష్యంగా చేసుకున్నారని అన్నారు. ఇది చికాకు తెప్పించింది. కుటుంబంలో కొన్ని విభేదాలు కూడా తలెత్తాయంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వత్తిడి వచ్చి ఉంటే.. తెలంగాణకు వెళ్లి ఉండే వారు కాదని మరికొందరు వాదిస్తున్నారు. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ తాము ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీని ఈ ఎన్నికల్లో దరి చేర్చుకుంటుందో లేదో తెలియని పరిస్థితులు ఉన్నాయి. బీజేపీని కూడా దూరం పెట్టాలని చంద్రబాబు నిర్ణయించినట్లు రాజకీయంగా టాక్ నడుస్తుంది.
బీజేపీతో పోరాటం చేయలేక...
అదే జరిగితే మరోసారి కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చే బీజేపీతో మరోసారి తాము పోరాటం చేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు కన్పించడం లేదు. పార్లమెంటులో రాష్ట్ర సమస్యలపై నిలదీయాల్సి ఉంటుంది. అప్పుడు కూడా తమను కేంద్ర ప్రభుత్వ సంస్థలు లక్ష్యంగా చేసుకుంటాయని గల్లా కుటుంబం అంచనాకు వచ్చింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి మరిన్ని ఇబ్బందులను ఎదుర్కొనాల్సి వస్తుందని భావించి గల్లా జయదేవ్ అడుగు వెనక్కు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన జరిమానాలు, పెట్టిన ఇబ్బందులపై హైకోర్టులో పోరాడి తమకు అనుకూలంగా తీర్పులు తెచ్చుకున్నారు. కానీ కేంద్రప్రభుత్వ సంస్థల దాడులతో వ్యాపారపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే మూడేళ్ల నుంచి ఆయన మౌనంగానే ఉంటూ వస్తున్నారు.
రెండు నెలలకు భయపడిపోతారా?
మరోవైపు టీడీపీ గుంటూరు టిక్కెట్ కాకుండా చంద్రగిరి నుంచి పోటీ చేయమని కూడా వత్తిడి రావడం కూడా ఒక కారణమని చెబుతున్నారు. గుంటూరులో ఆయనపై కార్యకర్తల్లోనూ వ్యతిరేకత వ్యక్తం అవుతుండటంతో పార్టీ హైకమాండ్ చంద్రగిరి నుంచి పోటీ చేయాలన్న ఒత్తిడి కూడా వస్తుందని తెలిసింది. మరోవైపు చిత్తూరు జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఆర్థికసాయం అందించాల్సి ఉంటుందని కూడా షరతు విధించినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. దీనిపై కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలపడంతో గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. బ్రేక్ ఇచ్చానని మాత్రమే చెప్పి వెళ్లిపోయారు. ఆయన బ్రేక్ చెప్పడానికి అనేక కారణాలుండగా.. టీడీపీ మాత్రం వైసీపీ ప్రభుత్వం కారణంగానే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పడం మాత్రం విడ్డూరంగా ఉందంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలసి పోటీ చేస్తూ తామే అధికారంలోకి వస్తుందని చంద్రబాబు పదే పదే చెబుతుండగా ఈ రెండు నెలలకు భయపడి ఆయన పాలిటిక్స్ ను వదిలి ఎందుకు పారిపోతాడన్న ప్రశ్న సరైందే కాదా? ఆలోచించాల్సిందే.