Galla Jayadev : గల్లా జయదేవ్ రెడీ అయిపోయారు.. ప్రకటన వెలువడేది ఆరోజేనట
గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు. ఈ మేరకు త్వరలోనే ఆయన ప్రకటన చేయనున్నారు
గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు. ఈ మేరకు త్వరలోనే ఆయన ప్రకటన చేయనున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని గల్లా జయదేవ్ నిర్ణయించుకున్నారని సమాచారం. రాజకీయాలను పక్కన పెట్టి పూర్తిగా వ్యాపారాలకే పరిమితమవ్వాలని ఆయన నిర్ణయించుకోవడంతో రాజకీయాలకు స్మాల్ బ్రేక్ ఇవ్వాలని భావిస్తున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో తాను గుంటూరు పార్లమెంటు నుంచి మరోసారి పోటీ చేయనని, మరొక అభ్యర్థిని చూసుకోవాలని కూడా గల్లా జయదేవ్ ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు.
గల్లా కుటుంబానికి...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గల్లా కుటుంబానికి ప్రత్యేకత ఉంది. గల్లా అరుణ కుమారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేశారు. తొలి నుంచి ఆ కుటుంబం కాంగ్రెస్ లోనే ఉంది. చంద్రగిరిలో గల్లా కుటుంబానికి ఇప్పటికీ తమదైన ఓటు బ్యాంకు కూడా ఉంది. గల్లా అరుణకుమారి రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే టీడీపీలో చేరిన తర్వాత ఆమె పెద్దగా యాక్టివ్ గా లేరు. ఆమె తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. గల్లా అరుణ కుమారి కుమారుడు గల్లా జయదేవ్ మాత్రం తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. అంటే మొన్నటి వరకూ అన్నమాట.
రెండుసార్లు ఎంపీగా...
ఆయన రెండుసార్లు గుంటూరు ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2014, 2019 ఎన్నికల్లో ఆయన గుంటూరు నుంచి ఎంపీగా విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాపార పరంగా కొన్ని ఇబ్బందులు రావడంతో అప్పటి నుంచి స్లో అయ్యారు. గుంటూరుకే కాదు పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన దూరంగానే ఉంటూ వస్తున్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. అయితే దానిపై ఎవరూ అధికారికంగా ప్రకటన మాత్రం చేయలేదు. అయితే ఎంపీగా చివరి సారి జరిగే బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనే ముందు ఆయన గుంటూరు ప్రజలు, తన అభిమానులతో సమావేశమవ్వాలని నిర్ణయించుకున్నారు.
వ్యాపారాలకే పరిమితమై....
ఈ నెల 28వ తేదీన గల్లా జయదేవ్ గుంటూరులో విందు సమావేశం ఏర్పాటు చేశారు. తనకు రెండు సార్లు ఎంపీగా అవకాశమిచ్చిన, గెలిపించిన కార్యకర్తలు, అభిమానులకు ఆయన విందు ఇవ్వనున్నారు. ఈ నెల 28న మధ్యాహ్నం శ్రీ కన్వెన్షన్ సెంటర్ లో ఈ విందు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే ఆయన తన రాజకీయ భవిష్యత్ పై ఒక ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. గల్లా జయదేవ్ ఈ సమావేశంలోనే తాను రాజకీయాలకు విరామం ప్రకటిస్తున్నట్లు తెలియజేస్తారన్న ప్రచారమూ జరుగుతుంది. ఆయన పూర్తిగా ఇక వ్యాపారాలకే పరిమితమవుతారని, కొంతకాలం తర్వాత తిరిగి రాజకీయాల్లోకి వస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు.