ఏపీ ప్రజల కోసం.. నేను దేనికైనా రెడీ: పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలన నుంచి ఉభయ గోదావరి జిల్లాలకు విముక్తి కల్పించాలన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలన నుంచి ఉభయ గోదావరి జిల్లాలకు విముక్తి కల్పించాలన్నారు. రాష్ట్రంలో రహదారుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని, వాహనమిత్ర కింద ఇచ్చే రూ.10 వేలు దేనికి సరిపోతాయని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. ఉపాధి అవకాశాలు లేక యువత బాధపడుతున్నారని, ఉద్యోగాలు లేక విదేశాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అన్ని జిల్లాలకు అన్నం పెట్టే నేల ఉభయ గోదావరి జిల్లా అని పవన్ పేర్కొన్నారు. ఉభయ గోదావరి జిల్లాలను అందరూ కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.
ఏపీ ప్రజల కోసం తాను ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అన్ని కులాలను సమానంగా గౌరవిస్తే అంబేద్కర్ ఆశయాలు నెరవేరినట్లేనన్నారు. కులాలకతీతంగా అందరికీ సమానంగా అవకాశాలు రావాలని పవన్ ఉద్ఘాటించారు. జనసేన గెలుపుకు కృషి చేయాలని పవన్ పిలుపునిచ్చారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మన ఎమ్మెల్యేలాగా పారిపోకూడదని విమర్శించారు. వర్గాల పోరులో జనసేనను కిందకు లాగొద్దని సూచించారు. జనసేన గెలుపు.. ప్రజల గెలుపు అని అన్నారు. గెలిచిన తర్వాత కమిట్‌మెంట్‌తో ఉండాలన్నారు. ఎదుటి వారి హక్కులకు భంగం కలిగించడం సరికాదని, అణగారిని కుటుంబాలకు కచ్చితంగా అండగా ఉంటామని అన్నారు.
రూల్ ఆఫ్ లా అందరికీ సమానమేనన్నారు. ఒక ఎమ్మెల్సీ మర్డర్ చేసి డోర్ డెలివరీ చేశాడని, కాకినాడలో దళితుడిని హత్య చేస్తే చట్టాలు ఏమయ్యాయని పవన్ ప్రశ్నించారు. శిక్షలు పడటానికి కులం చూడకూడదని, ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా శిక్షించబడాలన్నారు. రాజు నీతి తప్పితే నేల సారం తప్పుతుందంటూ పవన్ ఎద్దేవా చేశారు. ప్రజల్లో మార్పు మొదలైందని, అధికార పార్టీ నేతలు ఉలికిపాటుతో మనల్ని సర్వ విధాలా నాశనం చేసేందుకు యత్నిస్తున్నారని పవన్ ఆరోపించారు. తన బలం, బలహీనన తనకు తెలుసునన్నారు. పి.గన్నవరంలో జనసేన ఎగరాలని పవన్ పిలుపునిచ్చారు. గన్నవరంపై వ్యక్తిగతంగా పర్యవేక్షణ చేస్తానన్నారు.