పవన్ తపన చూసే.. జనసేనలోకి: పంచకర్ల

జనసేన పార్టీలో మరో కొత్త నాయకుడు చేరబోతున్నాడు. పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌ బాబు తీర్థం పుచ్చుకోబోతున్నారు

Update: 2023-07-16 11:28 GMT

జనసేన పార్టీలో మరో కొత్త నాయకుడు చేరబోతున్నాడు. పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌ బాబు తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఈ విషయాన్ని రమేష్‌ బాబే స్వయంగా ప్రకటించాడు. ఈ నెల 20వ తేదీన జనసేన పార్టీలో చేరనున్నట్టు తెలిపాడు. పవన్‌ కూడా తనను పార్టీలో స్వాగతించారని చెప్పారు. ఇవాళ మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి పంచకర్ల వెళ్లారు. అక్కడ పవన్‌ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. అనంతరం పంచకర్ల మాట్లాడుతూ.. మూడు రోజుల కిందట వైసీపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశానని చెప్పారు. ఇప్పుడు జనసేనలో చేరి పవన్‌ కల్యాణ్‌తో పని చేయాలనుకుంటున్నానని తెలిపారు.

ఈ నెల 20న సాయంత్రం 4 గంటలకు జనసేనలో చేరుతానని, సామాన్య కార్యకర్తలా పని చేస్తానన్నారు. జనసేన పార్టీ భావజాలం, రాష్ట్ర శ్రేయస్సు కోసం పవన్ కళ్యాణ్ పడుతున్న తపన చూసి తాను కూడా ఒక సైనికుడిలా ఆయన వెంట నడవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. రాష్ట్ర శ్రేయస్సు కోసం ఒక సైనికుడిలా పని చేస్తానన్నారు. పార్టీ ఉన్నతి కోసం కృషి చేస్తానని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా నూటికి నూరుపాళ్లు న్యాయం చేస్తానని చెప్పారు. తన అనుభవాన్ని పార్టీ ఉపయోగించుకుంటుందని పవన్‌ చెప్పారని పంచకర్ల అన్నారు. ఆత్మ గౌరవం దెబ్బతినడం వల్లే వైసీపీని వీడినట్లు రమేశ్ బాబు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు కూడా సీఎం కలిసే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక్క రూపాయి సంపాదించానని నిరూపిస్తే తన గొంతు కోసుకుంటానని శపథం చేశారు. వైవీ సుబ్బారెడ్డి అంటే తనకు అపారమైన గౌరవం ఉందన్నారు. అంతకుముందు పంచకర్ల రాజీనామా నిర్ణయం ముందు తనతో చర్చించి ఉంటే బాగుండేదని వైసీపీ ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో పెందుర్తి నుంచి పోటీ చేయాలని పంచకర్ల కోరుకున్నారు, అయితే ఇదే విషయమై వైసీపీలో సీటు గురించి ఎలాంటి హామీ దక్కలేదు. దీంతో పంచకర్ల వైసీపీ రాజీనామా చేశారు. ఇప్పుడు ఆయన జనసేనలో చేరబోతున్నట్టు ప్రకటించడంతో ఏపీ రాజకీయ వర్గాల్లో ఈ అంశం హాట్‌ టాపిక్‌గా మారింది. 

Tags:    

Similar News