Vallabhaneni Vamsi : గన్నవరం వంశీకి సీటు చిరిగిపోయిందా.... అసలు రీజన్ ఇదేనట
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఈసారి వైసీపీలో టిక్కెట్ దక్కడం కష్టంగా మారింది
వైసీపీ తన అభ్యర్థులను ప్రకటించే పనిలో ఉంది. ఇప్పటికే రెండు జాబితాలను విడుదల చేసిన వైసీపీ అధినాయకత్వం మూడో జాబితాను కూడా సిద్ధం చేసింది. అయితే రెండు జాబితాల్లో దాదాపు 38 మంది స్థానాల్లో కొత్తవారిని ఇన్‌ఛార్జులుగా నియమించారు. గత ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి అనుకూలురుగా మారిపోయారు. వారు నేరుగా పార్టీలో చేరకపోయినా అధికార పార్టీ మద్దతుదారులుగా ఉన్నారు. అయితే వీరిలో ఇప్పటికే ఒకరికి టిక్కెట్ ను నిరాకరిస్తూ వైసీపీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో మిగిలిన స్థానాలపై కూడా కొన్ని అనుమానాలు బయలుదేరాయి.
నలుగురు గెలిచి...
టీడీపీ నుంచి 2019 ఎన్నికల్లో గెలిచిన చీరాల నుంచి కరణం బలరామకృష్ణమూర్తి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి మద్దాలి గిరి, గన్నవరం నుంచి వల్లభనేని వంశీ, విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ లు వైసీపీ మద్దతుదారులుగా నిలిచారు. వీరిలో గుంటూరు పశ్చిమ నుంచి వైసీపీ అధినాయకత్వం మద్దాలి గిరిని తప్పించింది. ఆయన స్థానంలో మంత్రి విడదల రజనిని ఇన్‌ఛార్జిగా నియమించింది. దీంతో మిగిలిన వారి పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతుంది. అయితే చీరాల నుంచి కరణం బలరాం కుటుంబానికే టిక్కెట్ దక్కుతుందని చెబుతున్నారు. అలాగే వాసుపల్లి గణేశ్‌కు కూడా టిక్కెట్ లభిస్తుందన్న అంచనాలు ఉన్నాయి.
తప్పిస్తారంటూ...
కానీ గన్నవరం నుంచి వల్లభనేని వంశీని తప్పిస్తారన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్ధసారధిని గన్నవరం వెళ్లాలని వైసీపీ నాయకత్వం కోరినట్లు వార్తలు వస్తున్నాయి. అంటే వల్లభనేని వంశీని గన్నవరం తప్పించడానికే పార్టీ హైకమాండ్ సిద్ధమయినట్లేనా? అన్న అనుమానాలు బయలుదేరాయి. అయితే పార్ధసారధి మాత్రం గన్నవరం వెళ్లేందుకు సుతారమూ ఇష్టపడటం లేదు. దీంతో గన్నవరం పెద్దగా ఫోకస్ కాకపోయినా వల్లభనేని వంశీకి తిరిగి టిక్కెట్ ఇస్తే వైసీపీ నుంచి ఈసారి జరిగే ఎన్నికల్లో గెలవడం కష్టమని సర్వేలు కూడా చెబుతున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ స్థానంలో ఎవరికి టిక్కెట్ ఇస్తారన్న చర్చ జరుగుతుంది.
బదిలీ తప్పదా?
వల్లభనేని వంశీ గన్నవరం నుంచి రెండుసార్లు టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే గత ఎన్నికల్లో ఆయనకు తక్కువ మెజారిటీ మాత్రమే వచ్చింది. అక్కడ గత ఎన్నికలలో పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలోకి వెళ్లి అక్కడ ఇన్‌ఛార్జి పదవిని చేపట్టారు. అంటే యార్లగడ్డను గన్నవరంలో వైసీపీ అభ్యర్థి ఎదుర్కొనాల్సి ఉంటుంది. కానీ వైసీపీలో దుట్టా రామచంద్రరావు కూడా వల్లభనేని వంశీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీని పూర్తిగా పక్కన పెడతారా? లేక ఆయనకు మరొక సీటును కేటాయిస్తారా? అన్న దానిపై కూడా చర్చ జరుగుతుంది. పెనమలూరు నుంచి వల్లభనేని వంశీని పోటీ చేయించాలన్న ఆలోచనలో జగన్ ఉన్నట్లు కూడా ఒక వాదన వినిపిస్తుంది. మొత్తం మీద గన్నవరం సీటు మాత్రం వంశీకి గల్లంతయినట్లేనన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.