పేర్ని కిట్టు పొలిటికల్ ఎంట్రీ.. వైసీపీ ఓకే చెప్పినట్టేనా?
ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు వారసులు సిద్ధమవుతున్నారు. ఇందులో మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు;
ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు వారసులు సిద్ధమవుతున్నారు. ఇందులో మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు మొదటి వరుసలో ఉంటారు. రాష్ట్ర రాజకీయాల్లో పేర్ని నానికి స్పెషల్ ఐడెంటిటీ ఉంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి కేబినెట్‌లో పేర్ని నాని మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించారు. ప్రభుత్వం వచ్చే విమర్శలకు కౌంటర్ ఇవ్వడంలో నాని స్టైలే వేరు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ చేసే ఆరోపణలను మొదట ఎన్‌కౌంటర్ చేసేది పేర్ని నానినే. విమర్శలకు కౌంటర్ ఇవ్వడంలో పేరు పొందిన నానికి.. సీఎం జగన్ దగ్గర మంచి పేరు ఉంది.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానితో పాటు పేర్ని నాని ద్వయం విమర్శలకు కౌంటర్‌లో ఇవ్వడంలో పెట్టింది పేరు. రెండోసారి కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి పోయినప్పటికీ ప్రతిపక్షాలపై విమర్శల వర్షాన్ని నాని ఏ మాత్రం తగ్గించలేదు. సీరియస్ మ్యాటర్‌లో సెటైరికల్ కామెంట్స్ జోడించి విమర్శలు చేసే నాని.. ఇప్పుడు వచ్చే ఎన్నికలపై దృష్టి పెట్టారు. 2024 ఎన్నికల్లో తాను పోటీ చేయట్లేదని, తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని సీఎం జగన్ దగ్గర ప్రస్తావించినట్లు సమాచారం. దీనికి సీఎం జగన్ ఒకే చెప్పినట్టు పార్టీ వర్గాల నుంచి సమాచారం. మొన్ననే సీఎం జగన్ సాక్షిగా రాజకీయాలకు స్వస్తి పలకబోతున్నట్లు నాని ప్రకటన చేశారు. సీఎం జగన్‌తో మరో మీటింగ్‌లో పాల్గొంటానో లేదా కూడా తెలియదన్నారు.
ఇక నాని తనయుడు పేర్ని కిట్టు రాజకీయాల్లో ప్రత్యేకంగా శిక్షణ పొందారట. కిట్టుకి రాజకీయ ఓనమాలు దిద్దించడంతో పాటు, రాజకీయాల్లో ఎలా నడుచుకోవాలనేదానిపై అవసరమైన సలహాలు, సూచనలను కూడా నాని అందించారట. ఇప్పటికే పార్టీ పరంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలకు కిట్టుని పంపిస్తున్నారు నాని. రాష్ట్ర స్థాయి పార్టీ కార్యక్రమాలకు కూడా కిట్టు ఒక్కడికే నాని పంపించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లో పేర్ని నానికి మంచి పేరు ఉంది. ఆ పేరును కిట్టు ఏ మేర నిలబెడతాడో ముందు ముందు చూడాలి.