BRS: కేటీఆర్ ఈ కేసులో అరెస్టయితే పార్టీని నడిపేది ఆయనేనటగా
ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఒక స్పష్టత అయితే వచ్చింది. ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ అరెస్ట్ ఖాయమని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు;
ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఒక స్పష్టత అయితే వచ్చింది. ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ అరెస్ట్ ఖాయమని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఏసీబీ అరెస్ట్ చేస్తే బయటకు బెయిల్ పై వచ్చేందుకు ఎంత సమయం పడుతుందో కూడా తెలియదు. దీంతో న్యాయనిపుణులతో న్యాయపరమైన అంశాలు మాత్రమే చర్చించిన కేటీఆర్ పార్టీ కార్యక్రమాలను ఎవరు తీసుకెళతారన్న దానిపై కూడా గులాబీ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. నందినగర్ లోని కేటీఆర్ నివాసం నుంచే ఎర్రవెల్లి ఫాం హౌస్ లో ఉన్న కేసీఆర్ తో కూడా ఈ విషయాలను చర్చించినట్లు తెలిసింది. కేటీఆర్ అరెస్ట్ తర్వాత ఎవరి నాయకత్వంలో పార్టీ పనిచేయాలన్న దానిపై కూడా సమాలోచనలు జరిపారు.
కవిత పేరు చెప్పినా...
అయితే కొందరు ఈ సమావేశంలో కల్వకుంట్ల కవిత పేరు చెప్పారని తెలిసింది. అయితే కేసీఆర్ ఇందుకు అంగీకరించలేదని అంటున్నారు. కవితకు పార్టీ పగ్గాలు తాత్కాలికంగానైనా అప్పగించేందుకు కేసీఆర్ సుముఖత వ్యక్తం చేయలేదని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. హరీశ్ రావు విషయంలోనూ ఆయన అంత సుముఖంగా లేరని చెబుతున్నారు. కవిత, హరీశ్ రావుల పేర్లు కేటీఆర్ జైలుకు వెళ్లిన తర్వాత పార్టీ కార్యక్రమాలను చేపడితే బాగుంటుందన్న సూచనలను కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తోసిపుచ్చినట్లు చెబుతున్నారు. కేటీఆర్ లేని సమయంలో పార్టీ కార్యక్రమాలను ఎవరు పర్యవేక్షించాలన్న దానిపై తాను నిర్ణయం తీసుకుంటానని కేసీఆర్ నేతలకు చెప్పినట్లు తెలిసింది.
తానే వస్తానని...
కానీ నేతలు చెబుతున్న సమాచారం మేరకు కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతారని చెబుతున్నారు. మరొకరికి పార్టీ పగ్గాలు అప్పగించడం కంటే తానే బయటకు వచ్చి పార్టీ కార్యక్రమాలకు పిలుపునివ్వడం మంచిదన్న యోచనలో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు. కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తి కావడంతో తాను ఇకబయటకు రాక తప్పదని కూడా కేసీఆర్ సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. తానే వచ్చి రాష్ట్ర వ్యాప్త పర్యటన చేసి రాష్ట్రంలో వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. కేటీఆర్ అరెస్ట్ అయిన వెంటనే ఎర్రవెల్లి ఫాం హౌస్ నుంచి కేసీఆర్ బయటకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారని, రాష్ట్ర వ్యాప్త పర్యటనకు ముందు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఎండగట్టేందుకు ఆయన రెడీ అవుతున్నట్లు గులాబీ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ