RevanthReddy : రేవంత్ టీం గుట్టుగా పనిపూర్తి చేస్తుందా... బీఆర్ఎస్ కు షాకులు తప్పవా?
నాడు కేసీఆర్ సెట్ చేసిన ట్రెండ్ నే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఫాలో అవుతున్నట్లు కనపడుతుంది.
నాడు కేసీఆర్ సెట్ చేసిన ట్రెండ్ నే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఫాలో అవుతున్నట్లు కనపడుతుంది. 2014 నుంచి 2023 వరకూ కాంగ్రెస్ ను బలహీన పర్చేందుకే కేసీఆర్ ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అందుకోసం ఆయన ఒకదశలో బీజేపీ బలోపేతం కావడానికి కూడా అవకాశమిచ్చారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను వరసబెట్టి తన పార్టీలో చేర్చుకుని కండువాలు కప్పేసి శాసనసభలో నోరు మెదపకుండా చేసి ఇటు పెద్దల సభకు పంపాలన్నా, మండలికి ఎంపిక చేయాలన్నా మరే పార్టీకి అవకాశమివ్వకుండా చేయగలిగారు. ఇప్పుడు రేవంత్ దారి కూడా అలాగే కనిపిస్తుంది.
రాజ్యసభ ఎన్నికలకు ముందే...
రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలను కూడా తమవైపునకు తిప్పుకునే ప్రయత్నంలో రేవంత్ బిజీగా ఉంటున్నట్లే ఉంది. ఒకవైపు ముఖ్యమంత్రిగా పాలన చక్కబెడుతూనే పీసీసీ చీఫ్ గా పార్టీని కూడా బలోపేతం చేసేందుకు ఆయన అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ వెంకటేశంను తన పార్టీలోకి తీసుకు వచ్చారు. ఢిల్లీలో ఖర్గే చేత కండువా కప్పించేశారు. ఇంకా కొందరు క్యూ లైన్ లో ఉన్నట్లు పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. అత్యంత రహస్యంగా ఈ ఆపరేషన్ చేస్తున్నారు. మళ్లీ బీఆర్ఎస్ నేతలు వారితో టచ్ లోకి వెళ్లకుండా పార్టీలో చేరేంత వరకూ సమాచారాన్ని బయటకు పొక్కనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
చెప్పలేని పరిస్థితులు...
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవడానికి కారణాలు కూడా కాంగ్రెస్ కు బలంగా ఉన్నాయి. ప్రభుత్వాన్ని బలహీనం చేయడానికి బీఆర్ఎస్, బీజేపీలు ఏకమయ్యే ఛాన్స్ ను కొట్టిపారేయలేని పరిస్థితి. అందుకే ముందుజాగ్రత్త చర్యగా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను లాగేసుకుని బలాన్ని ఇంకాపెంచుకుంటే నిశ్చింతగా ఉండవచ్చన్న అభిప్రాయం పార్టీ నేతల్లో ఉంది. హైదరాబాద్ నగరం, దాని చుట్టుపక్కల మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా రాలేదు. దీంతో ఈ ప్రాంత ఎమ్మెల్యేలను తమ పార్టీ వైపునకు తిప్పుకునేందుకు ఏకంగా ఒక టీం రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు. వారు ఎవరికీ అనుమానం రాకుండా గుట్టు చప్పుడు కాకుండా పనిముగించేస్తారన్న పేరుంది.
ఐదారుగురు ఎమ్మెల్యేలు...
గతంలో కేసీఆర్ చేసిన పనినే ఇప్పుడు రేవంత్ చేస్తున్నారు. అలా తమ పార్టీ ఎమ్మెల్యేలను లాగేసుకున్నారన్న విమర్శలు కూడా బీఆర్ఎస్ చేయలేదు. ఎందుకంటే రెండు టర్మ్ లు తమకు అవసరం లేకపోయినా ఫిరాయింపులకు అవకాశమిచ్చింది ఆ పార్టీయే కావడంతో కారు పార్టీ మార్గంలోనే ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ప్రయాణం చేస్తున్నారంటున్నారు. మొత్తం మీద అతి త్వరలోనే ఐదారుగురు ఎమ్మెల్యేలు గులాబీ పార్టీని వీడి హస్తం గూటిలోకి వస్తారన్న టాక్ అయితే బలంగా వినిపిస్తుంది. మరి ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కదా? రాజకీయాలంటే అంతే మరి. పార్టీలు.. సిద్ధాంతాలు ముఖ్యం కాదు... ఐదేళ్లు అధికారమే ముఖ్యం. జనం కూడా తప్పుపట్టరన్న ధీమాతో రేవంత్ ఉన్నారు.