Jc Brothers : మూడు దరఖాస్తులు..అవి అప్లికేషన్లు కాదన్నాయ్.. వాటిని బీఫారాలుగా మార్చేయ్
జేసీ కుటుంబం చంద్రబాబు ఎదుట మూడు అప్లికేషన్లు ఉంచింది. మూడు నియోజకవర్గాలు తమ కుటుంబ సభ్యులకు ఇవ్వాలని కోరింది
జేసీ బ్రదర్స్ ఇద్దరూ రాజకీయాల్లో ఫుల్ ఫాంలో ఉంటేనే బెటరేమో.. ఎందుకంటే ఒక అసెంబ్లీ, ఒక పార్లమెంటు సీటుతో సరిపోయేది. జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసే వారు. ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి శాసనసభకు పోటీ చేసే వారు. ఇద్దరికీ ఒక అసెంబ్లీ.. ఒక పార్లమెంటు సీటుతో సరిపోయేది. కానీ ఇప్పుడు ఈ పెద్దోళ్లిద్దరూ రాజకీయంగా పక్కకు తప్పుకుని వారసులను రంగంలోకి దింపారు. గత ఎన్నికల్లో చేసిన ఈ ప్రయోగం వికటించింది. తాడిపత్రిలో అస్మిత్ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలుకాగా, అనంతపురం పార్లమెంటు నుంచి జేసీ పవన్ రెడ్డి పోటీ చేసి గెలుపొందలేదు.
ఇద్దరూ పక్కకు తప్పుకుని...
తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో వైసీపీ వస్తే ఒక్క తాడిపత్రిలో మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపాలిటీని గెలిపించుకున్నారు. ఆయన మున్సిపల్ ఛైర్మన్ అయ్యారు. జేసీ దివాకర్ రెడ్డి ఇక తాను రాజకీయాలు చేయలేనని పూర్తిగా పక్కకు తప్పుకున్నారు. కుమారులు చూసుకుంటారులే అనుకోని ఆయనంత ఆయనే స్వచ్ఛందంగా పక్కకు తప్పుకున్నారు. ప్రస్తుతం తాడపత్రి రాజకీయాల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి యాక్టివ్ గా ఉన్నారు కానీ, జేసీ దివాకర్ రెడ్డి మాత్రం అస్సలు రాజకీయాల జోలికే రావడం లేదు. ఆయన ఎక్కువ సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఆయన కుమారుడు పవన్ రెడ్డి మాత్రం ఈసారి కూడా పోటీ చేసి చట్ట సభల్లోకి అడుగు పెట్టాలని చూస్తున్నారు.
రాంగ్ టైంలో ఎంట్రీ ఇచ్చి....
అయితే జేసీ బ్రదర్స్ వారసులిద్దరూ రాంగ్ టైంలో రాజకీయంగా ఎంట్రీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో జగన్ గాలి బలంగా వీచింది. చంద్రబాబు పాలనపై ఉన్న వ్యతిరేకత తోడయింది. దాంతోనే తాము ఓటమి పాలయ్యామని భావిస్తున్నారు. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో టీడీపీ మూడు సీట్లు గెలిస్తే కుప్పం, హిందూపురం, ఉరవకొండ మాత్రమే. ఈసారి అలా కాదని, చంద్రబాబు, పవన్ పొత్తుతో గెలుపు ఖాయమని అంచనాలో జేసీ బ్రదర్స్ ఉన్నారు. అందుకే ఈసారి వారసులను మళ్లీ రంగంలోకి దించి చట్టసభల్లోకి పంపాలని ఉవ్విళ్లూరుతున్నారు. అందుకోసం జేసీ బ్రదర్స్ పెద్ద డిమాండ్‌నే పెద్దాయన ముందుంచారు. ఈసారి తమ కుటుంబం నుంచి ముగ్గురు పోటీలో ఉంటారని, మూడు సీట్లు కావాలని పట్టుపడుతున్నారు.
చివరి నిమిషం వరకూ...
తాడిపత్రి నుంచి జేసీ అస్మిత్ రెడ్డి, గుంతకల్లు నుంచి జేసీ పవన్ రెడ్డి, రాయదుర్గం నుంచి దీపక్ రెడ్డికి సీట్లు కేటాయించాలని చంద్రబాబు వద్ద అప్లికేషన్లు పడేశారు. ఇవి అప్లికేషన్లు కాదని.. వాటినే బీఫారాలుగా మార్చి ఇవ్వాలని జేసీ బ్రదర్స్ చంద్రబాబుపై వత్తిడి తెస్తున్నట్లు సమాచారం. నిన్న చంద్రబాబును హైదరాబాద్‌లో కలసి మరీ జేసీ ప్రభాకర్ రెడ్డి తమ డిమాండ్ ను ఆయన టేబుల్ పై ఉంచి వెళ్లారు. చంద్రబాబుకు ఈ విషయంలో ఏం చేయాలో పాలుపోవడం లేదు. కాదంటే వాళ్ల నోరు అసలే మంచిది కాదు. అలాగని అన్ని కుటుంబాలకు ఒక్కటే టిక్కెట్ ఇస్తూ ఒక్క జేసీ కుటుంబానికే మినహాయింపు ఇస్తే ఆ పక్కనే ఉన్న పరిటాల ప్యామిలీ ఒప్పుకుంటుందా? అందుకే చంద్రబాబు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. తాడిపత్రి మాత్రం వారికే కేటాయిస్తారు. ఈ మూడు సీట్లు చివరి నిమిషం వరకూ ఖరారు చేసేందుకు అవకాశమే లేదు. ఖచ్చితంగా ఆఖరి నిమిషంలో ఎవరో ఒకరికి బీఫారం ఇచ్చి చంద్రబాబు జేసీ బ్రదర్స్‌కు నచ్చ చెప్పే అవకాశాలే ఉన్నాయి.