Armur : అడిగేవాడు లేడనే కదా...అడ్డగోలుగా సంపాదించింది.. తిన్నది మొత్తాన్ని...కక్కిస్తారా?
ఆర్మూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కష్టాలు మొదలయ్యాయి. ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఇబ్బందులు పడుతుంది
తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ అతి విశ్వాసంతో ప్రతిపక్షానికే పరిమితమయింది. ఈ ఓటమిని ఎవరూ ఇప్పటి వరకూ జీర్ణించుకోలేకపోతున్నా.. అది వాస్తవం. కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చేసిన విషయం ఒక కలగానే ఉంది కారు పార్టీ నేతలకు. అయితే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒకే ఒక్క నియోజకవర్గం మాత్రం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. అదే ఆర్మూర్ నియోజకవర్గం. అక్కడ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి అధికారులు షాక్‌లు మీద షాక్‌లు ఇస్తున్నారు. అధికారంలో ఉన్న తొమ్మిదిన్నరేళ్లు తనకు తిరుగులేదని కాలరెగరేసి తిరిగిన జీవన్ రెడ్డి ఇప్పుడు చిక్కుల్లో పడిపోయారు.
కవిత ఇలాకాలో....
నిజామాబాద్ జిల్లా అంటే కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత అత్తగారి ప్రాంతం. నిజామాబాద్ అంటేనే కారు పార్టీకి కంచుకోట. అటువంటి జిల్లాలోని ఆర్మూరు నియోజకవర్గంలో జీవన్ రెడ్డి 2014, 2018 ఎన్నికల్లో వరసగా గెలిచారు. బీఆర్ఎస్ గొంతుగా నిలిచారు. అయితే తొమ్మిదిన్నరేళ్లు ఆయన చేసిన అవినీతి ఒక్కొక్కటి వెలుగు చూస్తుండటం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ఆర్టీసీకి చెందిన స్థలంలో మాల్ ను నిర్మించడంతో పాటు దానికి అద్దెలు కూడా చెల్లించలేదు. దాదాపు ఏడు కోట్ల రూపాయల లీజు మొత్తాన్ని ఎమ్మెల్యేగా వెలగబెడుతూ జీవన్ రెడ్డి ఎగ్గొట్టారు. అడిగేవాడు లేడని ఇష్టమొచ్చినట్లు వ్యవహరించారు.
45 కోట్ల బకాయి ఉన్నారంటూ...
తాజాగా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా జీవన్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. మొత్తం 45 కోట్ల రూపాయలు జీవన్ రెడ్డి బకాయీ పడ్డారు. మాల్ నిర్మాణం కోసం స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఇరవై కోట్లు అప్పు తీసుకున్నారు. ఇంతవరకూ పైసా చెల్లించలేదు. దానిపై వడ్డీ ఆరేళ్లుగా కట్టకపోతడంతో 25 కోట్ల రూపాయలు వడ్డీయే అయింది. 2017లో తీసుకున్న ఈ రుణం చెల్లించకపోవడంతో నలభై ఐదు కోట్ల రూపాయల బకాయి పేరుకుపోయింది. దీంతో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు జీవన్ రెడ్డి ఇంటికి నోటీసులు అంటించారు. అప్పులు చెల్లించకపోతే ఆస్తులు సీజ్ చేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే ఇంత వరకూ దీనికి జీవన్ రెడ్డి నుంచి అధికారులకు ఎలాంటి సమాధానం రాకపోవడంతో మరి అధికారులు తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారన్న సమాచారం అందుతుంది.
మున్సిపల్ ఛైర్మన్ మీద...
ఇక అదే ఆర్మూరులో మున్సిపల్ ఛైర్‌పర్సన్ మీద అవిశ్వాసం పెట్టడానికి సొంత పార్టీ నేతలే రెడీ అయ్యారు.26 మంది బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు కలెక్టర్ ను కలిశారు. ఆర్మూర్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ పండిత్ వినీతపై అవిశ్వాసం పెట్టేందుకు అనుమతివ్వాలని కోరారు. ఇది బీఆర్ఎస్ కు ఎదురు దెబ్బేనని చెప్పాలి. ఆర్మూరు మున్సిపాలిటీ కూడా కారు పార్టీ చేజారి పోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మున్సిపల్ ఛైర్మన్ కు వ్యతిరేకంగా సమావేశమయ్యారు. మొత్తం మీద ఆర్మూరులో కారు పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇది జీవన్ రెడ్డికి స్వయంకృతాపరాధమేనని చెప్పాలి. అందుకు మూల్యం కూడా ఆయనే చెల్లించుకోవాల్సి వస్తుంది.