బండి సంజయ్‌కి దక్కింది.. ప్రమోషనా? డిమోషనా?
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు నెలల ముందు కరీంనగర్ ఎంపీ, తెలంగాణ భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు నెలల ముందు కరీంనగర్ ఎంపీ, తెలంగాణ భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ శనివారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. పార్టీ పునర్వ్యవస్థీకరణ, సీనియర్ నేతలకు కీలకమైన పదవులు కేటాయించడంలో భాగంగా ఈ నియామకం జరిగింది. అంతేకాకుండా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం డీకే అరుణను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగించారు. కొద్దిరోజుల కిందటే బండి సంజయ్‌ని రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన బీజేపీ అధిష్ఠానం.. ఆయన స్థానంలో సీనియర్ నేత, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని నియమించింది.
అయితే తాజాగా సంజయ్‌కి జాతీయ స్థాయిలో పదవి లభించడంపై ఆయన అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ, నరేంద్ర మోదీ మంత్రివర్గంలోకి ఆయన చేరకపోవచ్చని స్పష్టంగా తెలియడంతో వారు కూడా ఈ పరిణామంతో నిరుత్సాహానికి గురవుతున్నారు. వాస్తవానికి తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ను అనధికారికంగా తొలగించిన వెంటనే కేంద్ర రాష్ట్ర మంత్రి హోదాలో ఆయనను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవచ్చని చర్చ సాగింది. అయితే ఇప్పుడు ఆ ఆశలు సన్నగిల్లాయి. ''జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకం బండి సంజయ్‌కి ప్రమోషనా? లేదా డిమోషనా? అని మాకు తెలియదు. అనేక మంది జాతీయ ప్రధాన కార్యదర్శులలో ఆయన ఒకరు.
తెలంగాణ విషయంలో ఆయనకు ఎలాంటి అధికారాలు ఉంటాయి?'' అని సంజయ్ విధేయులు అంటున్నారు. ఆయనను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి, ఆ స్థానంలో కిషన్‌రెడ్డిని నియమించడం ఆ పార్టీ క్యాడర్‌లో కొంత ఆందోళన కలిగించింది. కాబట్టి, బీజేపీ జాతీయ నాయకత్వం ఆయన సేవలను గుర్తించిందని చెబుతున్నప్పటికీ, ఆయన జాతీయ కమిటీకి ఎదగడం ఆయన అనుచరులకు పెద్దగా ఆనందాన్ని కలిగించలేదు. అటు బండి సంజయ్‌కు దక్కింది గట్టి ప్రమోషన్ అని చెప్పుకునేందుకు కూడా అస్కారం లేకుండా పోయింది.