'జ‌గ‌న్ గ‌ర్జిస్తే ఎలా ఉంటుందో తెలుసా'.. లోకేష్‌కు అంబటి మాస్‌ వార్నింగ్‌

ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలు.. తుటాల్లా పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు హద్దుల దాటి మరీ మాట్లాడుకుంటున్నారు.

Update: 2023-07-25 10:58 GMT

ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలు.. తుటాల్లా పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు హద్దుల దాటి మరీ మాట్లాడుకుంటున్నారు. తాజాగా ప్రతిపక్ష నేతలపై మంత్రి అంబటి రాంబాబు చెలరేగిపోయారు. ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి రచించిన 'అల్లుడు సుద్దులు' అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అంబటి.. ప్రతిపక్ష నేతలకు చురకలంటించారు. సీఎం వైఎస్‌ జగన్‌కు భయం అంటే ఏంటో చూపిస్తానన్న నారా లోకేష్ అనడంపై అంబటి తీవ్ర స్థాయిలో ఫైర్‌ అయ్యారు. వైఎస్‌ జగన్‌కు లోకేష్‌ భయాన్ని పరిచయం చేస్తాడా? అసలు తమ సీఎం గర్జిస్తే లాగులో పోసుకోవాలంటూ వార్నింగ్‌ ఇచ్చారు.

తెలుగుదేశం పార్టీకి లోకేష్‌ రూపంలో శని పట్టుకుందని సెటైర్‌ వేశారు. లోకేష్‌ పేరు మీద టీడీపీ గంగలో కలిసిపోతుందంటూ మంత్రి అంబటి శాపనార్థాలు పెట్టారు. చంద్రబాబుని సీఎం చేసేందుకు పవన్ కల్యాణ్ కష్టపడుతున్నారని ఎద్దేవా చేశారు. లోకేశ్‌తో చేరి దత్తపుత్రుడు చెడిపోతున్నాడని అన్నారు. అధికారం చేపట్టేందుకు చంద్రబాబు ఎలాగైతే అందరితో కలుస్తాడో, ఇప్పుడు దత్తపుత్రుడు కూడా అందరితో కలుస్తున్నాడని వ్యంగ్యంగా మాట్లాడారు. రోజుకు రూ.2 కోట్లు సంపాదిస్తానని చెబుతున్న పవన్‌.. పన్నులు కడుతున్నాడో, లేదో అంటూ మంత్రి అంబటి సందేహం వ్యక్తం చేశారు. చంద్రబాబులో ఉన్న మరో కోణమే 'అల్లుడు సుద్ధులు' పుస్తకం అని మంత్రి అంబటి అన్నారు.

సెటైరికల్‌గా చంద్రబాబు సుద్ధులను లక్ష్మీపార్వతి పుస్తక రూపంలో పొందుపరిచారని, ప్రతీ ఒక్కరూ ఈ పుస్తకం చదివే ప్రయత్నం చేయాలన్నారు. ఈ పుస్తకం చదివితే చంద్రబాబు నిజస్వరూపం తెలుస్తుందని చెప్పారు. చంద్రబాబును దగ్గరుండి చూశారు కాబట్టే లక్ష్మీపార్వతి ఈ పుస్తకం రాశారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కోవడానికి చంద్రబాబు ఎన్నో దుర్మార్గాలు చేశాడని అంబటి ఆరోపించారు. చంద్రబాబు లక్ష్మీపార్వతి భుజంపై తుపాకీ పెట్టి ఎన్టీఆర్‌ని కాల్చారని విమర్శించారు. చంద్రబాబు పూర్తి నిజస్వరూపం తెలిసిన వాళ్లెవరూ మాట్లాడటం లేదన్నారు. అధికారం కోసం చంద్రబాబు ఏదైనా చేస్తాడని విమర్శించారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీని కాంగ్రెస్ తో జత కట్టింటిన వ్యక్తి చంద్రబాబు అని పేర్కొన్నారు.

Tags:    

Similar News