పళ్లు రాలగొడ్తారు జాగ్రత్త : పవన్ కు మంత్రి రోజా వార్నింగ్
చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ ను పవన్ కల్యాణ్ సిగ్గులేకుండా చదువుతున్నాడని దుయ్యబట్టారు. వాలంటీర్లపై చేసిన ఆరోపణలకు..
ఏపీలో మహిళా వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు ఏపీ మంత్రులు. తాజాగా మంత్రి ఆర్కే రోజా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇరిటేషన్ స్టార్ పవన్ కల్యాణ్ రెండురోజులుగా రాష్ట్రంలో వాలంటీర్లు, సీఎంను ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. సీఎం అంటే పవన్ కు వణుకు అనుకున్నా కానీ.. జగన్ తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థ అన్నా వణుకేనంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి రోజా సెటైర్లు వేశారు. వాలంటీర్ వ్యవస్థ వెంట్రుక కూడా పీకలేవు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో ఓడిపోతామని పవన్, చంద్రబాబులకు అర్థమైందని, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ ను పవన్ కల్యాణ్ సిగ్గులేకుండా చదువుతున్నాడని దుయ్యబట్టారు. వాలంటీర్లపై చేసిన ఆరోపణలకు.. పవన్ వారి కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరాలని, లేదంటే పవన్ సంగతేంటో తేలుస్తారంటూ వార్నింగ్ ఇచ్చారు రోజా. రాష్ట్రంలో మహిళల అక్రమ రవాణా వాలంటీర్ల వల్లే జరుగుతుందని పవన్ మాట్లాడటం సిగ్గు చేటన్నారు. వాలంటీర్లపై సమాచారమిచ్చిన ఆ కేంద్ర నిఘా వర్గాలు ఎవరు ? వార్డు మెంబర్ గా కూడా గెలవని నీకు సమాచారం ఎవరిచ్చారు ? మహిళల అక్రమ రవాణాలో తెలంగాణ 6వ స్థానంలో ఉంది. మరి సీఎం కేసీఆర్ గురించి మాట్లాడే దమ్ముందా ? మాట్లాడితే హైదరాబాద్ లో ఉండలేవు.. అంటూ మంత్రి రోజా ఘాటు విమర్శలు గుప్పించారు. బాలకృష్ణ జనసేన వాళ్లను అలగా జనం అన్న మాట మరిచిపోయి.. ఆయన పిలిస్తే ఇంటర్వ్యూకు ఎలా వెళ్లావని ప్రశ్నించారు.
ఏపీ వాలంటీర్ల వ్యవస్థ గురించి ముస్సోరి ఐఏఎస్ సిలబస్ లో కూడా పెట్టారన్న రోజా.. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో సచివాలయానికైనా వెళ్దాం. నగరి అయినా.. భీమవరం, గాజువాక అయినా సరే.. అక్కడ వాలంటీర్ల పనితీరును గురించి అడుగుదాం అంటూ సవాల్ చేశారు. జగన్ మోహన్ రెడ్డి అంటేనే క్రియేటర్ అంటున్న పవన్.. వాలంటీర్ల గురించి తప్పుగా మాట్లాడితే పళ్లు రాలగొడ్తారని హెచ్చరించారు.