టీడీపీ పై కేశినేని ఫైర్..ఇన్ఛార్జ్ లు గొట్టంగాళ్లంటూ సంచలన వ్యాఖ్యలు
పార్టీలో ఇన్ ఛార్జ్ లు ఎవరో గొట్టంగాళ్లంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలే రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారని..
టీడీపీ అధిష్టానంపై ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని (శ్రీనివాస్) మరోసారి ఫైర్ అయ్యారు. ఇటీవల రాజమండ్రిలో నిర్వహించిన మహానాడుకు తనను పార్టీ ఆహ్వానించలేదని కేశినేని నాని ఫైర్ అయ్యారు. అలాగే విజయవాడలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి కూడా ఆహ్వానించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇలా చేసి.. ప్రజలకు ఏం సంకేతాలిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో మంచినీటి ట్యాంకర్ల ప్రారంభోత్సవం సందర్భంగా కేశినేని నాని ఈ వ్యాఖ్యలు చేశారు.
పార్టీలో ఇన్ ఛార్జ్ లు ఎవరో గొట్టంగాళ్లంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలే రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారని గుర్తుచేశారు. తాను మంచివాడిని కాబట్టే ఇతర పార్టీల నుంచి ఆహ్వానాలు వస్తున్నాయన్నారు. తనను పార్టీ దూరం పెడితే.. ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలుస్తానని కేశినేని నాని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడలో ప్లెబిసైట్ పెడితే ప్రజల్లో తనకున్న ఆదరణేంటో తెలుస్తుందన్నారు. పొమ్మనలేక పొగబెడుతున్నారా ? అని ఓ విలేకరి ప్రశ్నించగా.. ఆ విషయాన్ని పార్టీ అధిష్టానాన్ని అడగాలని, తనకేమీ తెలియదన్నారు. ఇటీవల చంద్రబాబు ఢిల్లీ వెళ్లేటపుడు తనకు పీఏ ఫోన్ చేసి చెప్పారు కానీ.. అక్కడేం మాట్లాడరన్నది కూడా తనకు తెలియదని కేశినెని తెలిపారు. పార్టీలో ఉంటూనే.. అధిష్టానం పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో రాజకీయంగా ఆసక్తికర చర్చ మొదలైంది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ కేశినేని నానికి టికెట్ ఇస్తుందా ? ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా ? లేక పార్టీ మారుతున్నారా ? అని ప్రజలు చర్చించుకుంటున్నారు.