పవన్‌కు చెక్‌మేట్‌గా ముద్రగడ.. జగన్‌ నయా ప్లాన్‌!

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో

Update: 2023-06-10 03:12 GMT

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాకినాడ నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ, గోదావరి జిల్లాల ఇన్‌చార్జి పి.మిథున్‌రెడ్డితో ప్రాథమిక దఫా చర్చలు జరిపిన ముద్రగడ.. శుక్రవారం కిర్లంపూడిలోని తన నివాసంలో కాకినాడ వైఎస్సార్‌సీపీ ఎంపీ వంగగీత, ఇతర వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేతలతో మరోసారి చర్చలు జరిపారు. ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నుంచి సందేశం తీసుకొచ్చిన వైఎస్సార్‌సీపీ నేతలు ముద్రగడకు కాకినాడ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో టిక్కెట్‌ ఇస్తుందని ముద్రగడకు సమాచారం అందించారు.

ఒకవేళ ముద్రగడ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇష్టపడని పక్షంలో ఆయన కుమారుడికే టిక్కెట్‌ ఇస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. “తండ్రీకొడుకులు ఇద్దరూ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపకపోతే, వారిలో ఒకరికి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టిక్కెట్టు ఇవ్వబడుతుంది” అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ ఆఫర్‌పై ముద్రగడ సంతోషం వ్యక్తం చేశారని, ఎంపీ లేదా ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేయాలా వద్దా అనే విషయంపై తన కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని వైఎస్సార్‌సీపీ నేతలకు తెలిపినట్లు సమాచారం. గత కొంత కాలంగా ముద్రగడ వైఎస్సార్‌సీపీ నేతలతో టచ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లో తన భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తానని ఆయన ఇటీవల ప్రకటన చేశారు.

కాపు ఫ్యాక్టర్ కారణంగా గోదావరి జిల్లాల్లో బలపడుతున్న జనసేన పార్టీ ప్రభావాన్ని ఎదుర్కోవాలంటే ముద్రగడ లాంటి ప్రముఖ కాపు నేతను పార్టీలోకి తీసుకురావడమే సరైన మార్గమని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముద్రగడ తన సొంత సీటుతో పాటు ఆంధ్రాలోని గోదావరి ప్రాంతమంతా కాపులపై ప్రభావం చూపగల సమర్థుడు.. పవన్ కళ్యాణ్‌తో పోలిస్తే కాపుల కోసం పోరాడే క్రెడిబిలిటీ ఆయనకు ఎక్కువ. కాబట్టి ఇది కచ్చితంగా వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా మారుతుంది. వచ్చే ఎన్నికల్లో కాపులను తనవైపు తిప్పుకోవడంలో సీఎం జగన్‌ తన వ్యూహాలను అమలు చేస్తూ వస్తున్నారు. అయితే కాపు సామాజిక వర్గంలో ట్రంప్ కార్డుగా ఉన్న ముద్రగడ పద్మనాభం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. 

Tags:    

Similar News