Nellore : నారాయణకు "ప్రశాంత"త లేదట.. వైసీపీ అభ్యర్థి ఆమేనట
నరసరావుపేట లోక్‌సభ స్థానానికి అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు సిటీకి వేమిరెడ్డి ప్రశాంతి పేర్లు ఖరారయిందని తెలుస్తోంది.
నరసరావుపేట లోక్‌సభ స్థానానికి అనిల్ కుమార్ యాదవ్ పేరు ఖరారయిందని తెలుస్తోంది. ఈరోజు వైఎస్ జగన్ నెల్లూరు నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. నెల్లూరు పట్టణ నియోజకవర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను అక్కడి నుంచి షిఫ్ట్ చేసి నరసారావు పేట లోక్‌సభ కు పోటీ చేయించాలని నిర్ణయం జరిగిపోయిందంటున్నారు. నెల్లూరు టౌన్ లో ఈసారి అనిల్ గెలుపు కష్టమని సర్వే నివేదికలు రావడంతో ఆయనను మార్చేందుకే అధినాయకత్వం డిసైడ్ అయినట్లు తెలిసింది. ఈ రోజు దీనిపై జగన్ నెల్లూరు జిల్లా నేతలకు క్లారిటీ ఇవ్వనున్నారు.
నరసరావుపేటకు షిఫ్ట్ చేసి...
నెల్లూరు పట్టణ నియోజకవర్గంలో అనిల్ కుమార్ యాదవ్ రెండు సార్లు విజయం సాధించారు. ఆయన 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. జగన్ తొలి విడత మంత్రివర్గంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే ఆయన కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తుంటే ఆయనను షిఫ్ట్ చేయడం ఖాయమని తేలిపోయింది. తాను జగనన్న మనిషినని, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని, జగన్ కోసం నిలబడతానని తెలిపారు. నెల్లూరు కాకపోయినా ఏ సీటు ఇచ్చినా తాను పోటీ చేస్తానని చెప్పారు. అంతేకాదు ఢిల్లీలో పార్టీ గళం విప్పడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించడంతో ఆయన నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా వెళ్లడం ఖాయమని ఖరారయింది.
సర్వేలు చేయించి...
అయితే అనిల్ కుమార్ యాదవ్ ను నరసారావుపేట పార్లమెంటు అభ్యర్థిగా పంపిస్తే నెల్లూరు టౌన్ లో ఎవరు పోటీ చేస్తారన్న దానిపై కూడా అధినాయకత్వం కసరత్తులు చేసిందంటున్నారు. పలు రకాలుగా సర్వేలు చేయించిందట. అక్కడ మాజీ మంత్రి నారాయణ మరోసారి బరిలోకి దిగుతుండటం, ఆయన ఆర్థికంగా బలవంతుడే కాకుండా ఈసారి జనసేన మద్దతు కూడా ఉండటంతో అక్కడ గెలవాలంటే అనిల్ యాదవ్ ను తప్పించడమే మార్గమని అధినాయకత్వం డిసైడ్ అయినట్లు తెలిసింది. లేకపోతే గత ఎన్నికల్లో పది స్థానాలకు పదింటిలో గెలిచిన వైసీపీ ఈసారి ఒకటి కోల్పోయే అవకాశముందని కూడా సర్వే నివేదికలు చెప్పాయట.
ప్రశాంతి అయితే...
దీంతో అనిల్ కుమార్ యాదవ్ స్థానంలో వేమిరెడ్డి ప్రశాంతి పేరును దాదాపు ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఆమె అయితే కరెక్ట్ క్యాండిడేట్ అని జనం నుంచి కూడా ఫీడ్ బ్యాక్ అందినట్లు తెలుస్తోంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతి పేరునే చివరకు ఫైనల్ చేసే అవకాశాలున్నాయి. ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎటూ వైసీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆర్థికంగా బలమైన నేత కావడంతో పాటు సేవా కార్యక్రమాలు కూడా విస్తృతంగా ఆయన కుటుంబం చేయడంతో ప్రశాంతి పేరును చివరకు నిర్ణయిస్తారని చెబుతున్నారు. ఈరోజు నెల్లూరు జిల్లా నేతలతో జగన్ సమావేశాలు ముగిసిన తర్వాత దీనిపై ఒక స్పష్టత రానుంది.