ఎన్డీయే వర్సెస్ ఇండియా.. ఎవరి బలమెంత?
లోక్‌సభ ఎన్నికలకు ముందు పొలిటికల్ హీట్ పెరుగుతోంది. భారత జాతీయాభివృద్ధి సమిష్టి కూటమి (ఇండియా) వర్సెస్ ఎన్డీఏ కూటమిలు వరుస
లోక్‌సభ ఎన్నికలకు ముందు పొలిటికల్ హీట్ పెరుగుతోంది. భారత జాతీయాభివృద్ధి సమిష్టి కూటమి (ఇండియా) వర్సెస్ ఎన్డీఏ కూటమిలు వరుస సమావేశాలు నిర్వహిస్తూ బలాలను పెంచుకుంటున్నారు. లోక్‌సభ ఎన్నికల కోసం ఒకే వేదికపైకి వచ్చిన ప్రతిపక్ష పార్టీలు తమ కొత్త కూటమికి భారత జాతీయాభివృద్ధి సమిష్టి కూటమి (ఇండియా) అనే పేరు ఖరారు చేశాయి. ఐ - ఇండియన్, ఎన్ - నేషనల్, డి - డవలప్‌మెంటల్, ఐ - ఇంక్లూజివ్, ఎ - అలయెన్స్ (ఐఎన్‌డిఐఎ)గా మార్చారు. అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే), భారత జాతీయాభివృద్ధి సమిష్టి కూటమి (ఇండియా) సమావేశాలకి దీటుగా బల బలాలను ప్రదర్శించేందుకు రెడీ అయ్యాయి. ఎన్డీయే కూటమిలో మరికొన్ని కొత్త పార్టీలు సైతం చేరనున్నట్లు తెలుస్తోంది. లోక్ జనశక్తి పార్టీ, ఒ.పి.రాజ్‌భర్ నేతృత్వంలోని ఎస్‌బీఎస్సీ, హిందూస్తానీ అవామ్ మోర్చా వంటి పార్టీలు అధికార కూటమిలో చేరేందుకు సిద్ధంగా వున్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది చివర్లో జరగనున్న 5 రాష్ట్రాల ఎన్నికలు.. ఆ తర్వాత వచ్చే ఏడాది జరగనున్న సాధారణ ఎన్నికలకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలోనే పార్టీలో నూతన మార్పులకు శ్రీకారం చుట్టిన బీజేపీ.. ఇక నుంచి భాగస్వామ్య పక్షాల వైపు చూస్తోంది. 2019 ఎన్నికల తర్వాత ఒక్కొక్కరిగా ఎన్డీఏలోని పార్టీలను దూరం పెట్టిన కమలం పార్టీ. విపక్షాలన్నీ ఏకమవుతున్న సమయంలో వేళ ఎన్డీఏ సమావేశం కీలకంగా మారింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వము ఎన్నికల శంఖారావానికి సిద్ధమవుతోంది. ఈ సంవత్సరం చివర్లో జరిగే తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందుగానే రంగం సిద్దం చేసుకుంటుంది. భారత జాతీయాభివృద్ధి సమిష్టి కూటమి (ఇండియా) , ఇటు ఎన్డీఏ కూటములకు దూరంగా ఉన్న పలు పార్టీలకు చేర్చుకోవాలని రెండు కూటములు ప్రయత్నం చేస్తున్నాయి.
మరోవైపు గతంలో ఎన్డీఏలో ఉండి.. కూటమి నుంచి బయటకు వెళ్లిన పార్టీలను కూడా మళ్లీ ఎన్డీఏలో కలుపుకోవాలని బీజేపీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎన్డీఏ కూటమిలో ఉండే కొన్ని పార్టీలు బీజేపీతో తెగదెంపులు చేసుకుని బయటకు వెళ్లాయి. ఇందులో జేడీఎస్, టీడీపీ, శిరోమణి అకాళీదళ్ సహా వివిధ పార్టీలు 2019 తర్వాత బీజేపీ విధానాలతో ఎన్డీఏ కూటమిలో ఉండలేక బయటకు వచ్చాయి. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈ పార్టీల మద్దతు బీజేపీకి అవసరం కానుంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఆ పార్టీలను ఎన్డీఏ గూటికి చేర్చాలని బీజేపీ అధిష్ఠానం పావులు కదుపుతోంది. వీటితోపాటు అటు భారత జాతీయాభివృద్ధి సమిష్టి కూటమి (ఇండియా) , ఇటు ఎన్డీఏ కూటముల్లో లేని వైసీపీ సహా పలు ప్రాంతీయ పార్టీలను కూడా వచ్చే ఎన్నికల నాటికి ఎన్డీఏలో చేర్చుకునేలా బీజేపీ పెద్దలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్డీఏలో నుంచి 2018లో కూటమి టీడీపీ నుంచి వైదొలగింది.
ఎన్డీఏ కూటమిలో టీడీపీతో పాటు లోక్ జనశక్తి పార్టీ - ఎల్‌జేపీ, అకాలీదళ్ తదితర పార్టీలను చేర్చుకుని కూటమి బాలాన్ని పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 2024 సాధారణ ఎన్నికలు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. విధివిధానాలపై బీజేపీ అగ్రనేతలు చర్చలు జరపనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే 4 రాష్ట్రాల్లో బీజేపీ అధిష్ఠానం అధ్యక్ష మార్పులు చేసింది. ఇది ఇలా వుండగా భారత జాతీయాభివృద్ధి సమిష్టి కూటమి (ఇండియా) ప్రధానంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. బీజేపీపై వ్యతిరేకత వున్న పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని యూపీఎ కూటమి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలు ఒకే వేదికపైకి వచ్చాయి. అదే సమయంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే తన పరిధిని విస్తరించుకునే పనిలో బిజీగా వుంది. ఈ క్రమంలోనే ఎన్డీయే కు చెందిన 38 పార్టీల సమావేశం ప్రధానాంశంగా మారిందని రాజకీయ విశ్లేషకులు చరించుకుంటున్నారు.