జగన్‌ ‘ఒక్కఛాన్స్‌’.. పవన్‌ ‘రెండు ఛాన్సులు’

పవన్ కళ్యాణ్ పేరుకి ఒక్క ఛాన్స్ అడుగుతున్నారు కానీ, 2024, 2029లలో తనను ముఖ్యమంత్రిని చేయాలని అడుగుతున్నారు.

Update: 2023-06-16 13:50 GMT

తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతున్న వారాహి విజయ యాత్ర సంచలనాలకు కేంద్రంగా మారుతోంది. గతంలో పవన్‌ బహిరంగ సమావేశాల్లో, ర్యాలీల్లో పాల్గొన్నప్పుడు అధికారం వైకాపాను విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకునేవారు. ముఖ్యంగా జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించేవారు. పొత్తులతోనే తాను ముందుకు వెళ్తానని అనేవారు. కానీ మొన్నటి నుంచి ప్రారంభమైన వారాహి యాత్రలో తన మ్యానిఫెస్టోను కూడా ప్రకటించారు.

కత్తిపూడిలో జరిగిన వారాహి యాత్ర అనంతరం పవన్‌ కాకినాడ దగ్గర ఉన్న చేబ్రోలులో రైతులు, చేనేత కళాకారులు, పట్టు రైతులతో ఆయన మాట్లాడారు. జనసేనకు  ఒక్కఛాన్స్‌ ఇవ్వాలని, రాష్ట్రాన్ని బంగారు ఆంధ్రప్రదేశ్‌గా మారుస్తానని చెప్పారు. దానికి కొనసాగింపుగా 2024, 2029 లో తనను ముఖ్యమంత్రిని చేయాలని రాష్ట్ర భవిష్యత్తును మార్చేస్తానని చెబుతున్నారు. ఒకవేళ తన పాలన నచ్చకుంటే రెండేళ్లలో తానే స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకుంటానని చెబుతున్నారు.

పదేళ్లు పరిపాలించడానికి ఛాన్స్‌ అడిగి రెండేళ్లలో తప్పుకుంటానని పవన్ చెప్పడంపై రాజకీయ పరిశీలకులు విభిన్నంగా స్పందిస్తున్నారు. పేరుకు జగన్‌లా ఒక్క ఛాన్స్‌ అని అంటున్నా, తనకు రెండు ఛాన్సులు కావాలని పరోక్షంగా పవన్‌ అడుగుతుండటం విశేషం. 

Tags:    

Similar News