పవన్‌ నోట.. కొత్త మాట

పవన్‌ కళ్యాణ్‌ వారాహి యాత్ర ఆసక్తికరంగానే ప్రారంభమైంది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా పవన్‌ ప్రసంగంలో..

Update: 2023-06-15 08:05 GMT

janasena kathipudi sabha highlights

మారింది వ్యూహమా! స్వరమా!

ముఖ్యమంత్రి పీఠంపై జనసేనాని ఆశలు!

వేడెక్కుతున్న ఆంధ్రప్రదేశ్‌ రాజకీయం

 పవన్‌ కళ్యాణ్‌ వారాహి యాత్ర ఆసక్తికరంగానే ప్రారంభమైంది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా పవన్‌ ప్రసంగంలో ఆశావహ దృక్పథం కనిపింది. గతంలో రణస్థలం, మచిలీపట్నం సభల్లో వైకాపాను  ఓడించడమే తన లక్ష్యమని ప్రకటించారు. దీనికోసం ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటామని చెప్పారు. తనకు ఒంటరిగా పోటీ చేసే సత్తా లేదని చాలాసార్లు ప్రకటించారు. బుధవారం కత్తిపూడిలో జరిగిన బహిరంగ సభలో పొత్తుల గురించి జనసేనాని నామమాత్రంగా కూడా ప్రస్తావించలేదు. పైపెచ్చు ఇన్నాళ్లూ భాగస్వామిగా చెప్పుకున్న బీజేపీపై విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి ఇటీవల విడుదల చేసిన నిధుల వెనుక వైకాపా, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉందేమోననే సందేహాన్ని పవన్‌ వ్యక్తం చేశారు.

అన్నీ కలిసొస్తే తాను ముఖ్యమంత్రి కావచ్చని అభిమానుల కేరింతల మధ్య ప్రకటించారు. పనిలో పనిగా షణ్ముఖ వ్యూహం అంటూ తన మ్యానిఫెస్టోని కూడా ప్రకటించారు. మహానాడు సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు పలు హామీలు గుప్పించారు. కత్తిపూడి సభలో జనసేనాని కూడా ఎన్నికల మ్యానిఫెస్టోని ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కూటమి అధికారంలోకి వస్తే రెండు పార్టీల మ్యానిఫెస్టోలు అమలు చేయాలి. జగన్‌ ప్రతీసారి చంద్రబాబు విశ్వసనీయతను ప్రశ్నిస్తుంటారు. హామీల అమలులో ఏ మాత్రం తడబడినా జగన్‌కు అతిపెద్ద అస్త్రం అందించినట్లవుతుంది. ప్రత్యర్థి బలహీనతతో ఆడుకోవడం, దానిని ప్రజల మెదళ్లలోకి ఎక్కించడం జగన్‌ పెద్ద బలం.

‘నేను విడిగా వస్తానో, కలిసి వస్తానో ఇంకా డిసైడ్‌ చేయలే. తర్వాత చెప్తా’ అని కత్తిపూడి సభలో పవన్ పేర్కొన్నారు. ‘అసెంబ్లీలో అడుగుపెట్టి తీరుతా’ అన్నారు. అంటే ఆయన లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా? స్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమా? విడిగా పోటీ చేసి ఓ నలభై, యాభై సీట్లు తెచ్చుకుని, తానే స్వయంగా ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారా? లేదా కింగ్‌ మేకర్‌గా అవతరించాలనుకుంటున్నారా? లేదంటే ప్రత్యర్థులు ఆరోపిస్తున్నట్లు ఇది చంద్రబాబు స్క్రిప్ట్‌లో భాగమా? లోకేష్‌ పాదయాత్ర రాయలసీమను దాటేవరకూ పవన్‌ వారాహిని బయటకు తీయలేదని ఆరోపిస్తున్నారు ఇదంతా తెదేపా వ్యూహమని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు.. ప్రాంతాల వారీగా, కులాల వారీగా ఓట్లను సమీకృతం చేయడమే తెలుగుదేశం లక్ష్యమని తేల్చి చెబుతున్నారు..

ఈ ఆరోపణలకు తగ్గట్లుగానే పవన్‌ కత్తిపూడి సభలో కాపుల గురించి ప్రస్తావించారు. ‘కాపులను బీసీల్లో చేర్చలేమని చెప్పిన ముఖ్యమంత్రి మనకు అవసరమా’ అంటూ ప్రశ్నించారు. అన్ని పదవులూ ఒకే సామాజిక వర్గానికి కట్టబెడుతున్నారని పరోక్షంగా రెడ్లను విమర్శించారు. లోకేష్‌ రాయలసీమలో రెడ్లను ప్రసన్నం చేసుకోడానికి తంటాలు పడుతుంటే, పవన్‌ ఆ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడటం విశేషం. మొత్తమ్మీద పవన్‌ వారాహి యాత్ర ఎన్నో ప్రశ్నలను సంధిస్తోంది, ఎన్నో చిక్కుముడులు వేస్తోంది. వీటన్నింటికీ సమాధానం ఎన్నికలే చెబుతాయి. 

Tags:    

Similar News