పవన్ వైపు 'పిల్లి' అడుగులు !

ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వైసీపీతో తెగతెంపులు చేసుకోవడానికి రంగం సిద్ధమైంది.ఆయన జనసేన వైపు అడుగులు వేసే అవకాశాలను కొట్టి పారవేయలేమని కాకినాడకు చెందిన రాజకీయ పరిశీలకుడొకరు;

Update: 2023-07-23 16:42 GMT

pilli subhash chandrabose

ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వైసీపీతో తెగతెంపులు చేసుకోవడానికి రంగం సిద్ధమైంది.ఆయన జనసేన వైపు అడుగులు వేసే అవకాశాలను కొట్టి పారవేయలేమని కాకినాడకు చెందిన రాజకీయ పరిశీలకుడొకరు 'తెలుగు పోస్టు'కు చెప్పారు.ఉభయ గోదావరి జిల్లాల్లో వీస్తున్న జనసేన గాలి పిల్లిని ఆకర్షించవచ్చునని ఆయన అంచనా వేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గడచిన కొద్దిరోజులుగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ,ఎంపీ.పిల్లి.సుభాష్ చంద్రబోస్ మధ్య ఏర్పడిన అల్ప పీడనం వాయుగుండంగా మారింది.పిల్లి సుభాష్ చంద్రబోస్ ను ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి క్యాంపు ఆఫీసుకు పిలిపించి నచ్చజెప్పినా పిల్లి శాంతించలేదు.ఆయన మంత్రి వేణుగోపాలకృష్ణపైనే కాదు,పార్టీ అధ్యక్షుడు జగన్ మోహనరెడ్డిపై కూడా తిరుగుబాటు జెండా ఎగురవేసినట్లయ్యింది.వచ్చే ఎన్నికల్లో వేణుకు టికెట్టు ఇస్తే తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటించడం నిస్సందేహంగా వైసీపీ క్రమశిక్షణ రాహిత్యం కిందకు వస్తుంది.ఎంపీ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి,ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.పిల్లిపై పార్టీ హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న అంశం ఆసక్తిని కలిగిస్తోంది.

రామచంద్రాపురం నుంచి తన కొడుకును ఎమ్మెల్యేగా బరిలోకి దింపాలన్నది పిల్లి సుభాష్ చందద్రబోస్ లక్ష్యం.ముఖ్యమంత్రి జగన్ తో భేటీలో ఈ అంశంపైనే చర్చ జరిగింది. పిల్లి ప్రతిపాదనలను సీఎం సున్నితంగా తిరస్కరించారు.ఆచరణ సాధ్యం కాదన్నారు. పిల్లి కొడుక్కి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు.అయినా పుత్ర వాత్సల్యం కన్నా పార్టీ పట్ల విధేయత ముఖ్యం కాదని సీనియర్ రాజకీయ నాయకుడు అయినా పిల్లి భావిస్తున్నట్లుంది.

పోనీ మంత్రి వేణుగోపాలకృష్ణ అయినా.... పార్టీ పట్ల,ముఖ్యమంత్రి జగన్ పట్ల విధేయుడిగా పనిచేస్తున్నారా ? అనే విషయమై అనుమానాలు కలుగుతున్నవి.లేకపోతే పిల్లి చేసిన తప్పు మంత్రి కూడా ఎందుకు చేసినట్టు? ఆదివారం నాడు మంత్రి వేణు బలప్రదర్శన ఎందుకు చేసినట్టు?ఇద్దరూ -ఇద్దరే ! ఒకరు ఎక్కువ,మరొకరు తక్కువ అనడానికి వీల్లేదు.ఇంతకుముందు పిల్లి వర్గం మూడు సార్లు బలప్రదర్శన చేశారంటూ మంత్రి వేణు వర్గం ఆరోపిస్తూ వచ్చింది.జగన్ పిల్లిని పిలిచి మాట్లాడి నచ్చజెప్పారు.ముఖ్యమంత్రి జగన్ ఏమి ఆలోచిస్తున్నారో పట్టించుకోకుండా మంత్రిగా ఉన్న వ్యక్తి బలప్రదర్శన చేయడం వైసీపీ హైకమాండ్ డొల్ల తనాన్ని బట్టబయలు చేస్తోంది.

‘‘కార్యకర్తలు,క్యాడర్‌ వద్ద వేణు ఎన్నిరోజులు నటిస్తారు? వేణు చెప్పు కింద బతికే వాళ్లం అనుకుంటున్నారా? వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్‌ తోనే ఉన్నాం.వేణుతో కలిపి నన్ను సమావేశపరుస్తానని సీఎం జగన్‌ చెప్పారు.క్యారెక్టర్‌ లేని వ్యక్తితో కూర్చోనని తేల్చి చెప్పాను’’ అని పిల్లి సుభాష్‌ వ్యాఖ్యానించారు.

''పిల్లి సుభాష్ చంద్రబోస్ మా గురువులాంటి వారు.ఆయనతో నాకెలాంటి విభేదాలు లేవు.అంతిమంగా నేను సీఎం జగన్ మాటకు కట్టుబడి ఉంటాను'' అని మంత్రి వేణు ఆదివారం చెప్పారు.పార్టీలోని ఒక ఎంపీ,మరొక మంత్రిని కట్టడి చేయడంలో జగన్ ఆయన చుట్టూ ఉన్న భజన బృందం విఫలమవుతోంది.

(Views, thoughts, and opinions expressed in this newsstory/article belong solely to the author)

Tags:    

Similar News