రాజ్యసభ స్థానానికి పొంగులేటి ఎంపిక‌?

గ‌త పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఖ‌మ్మం ఎంపీ స్థానం నామాకు ఇచ్చారు. దీంతో అప్ప‌టి నుంచి పొంగులేటి ఏ పదవీ లేకుండా ఖాళీగా ..

Update: 2022-05-06 09:40 GMT

తెలంగాణ‌లో ఒక రాజ్య‌స‌భ స్థానం ఖాళీగా ఉంది. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ ఈ నెల 12వ తేదీన విడుద‌ల కానుంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన బండా ప్రకాశ్ డిసెంబర్ 2న రాజ్యసభ స్థానానికి రాజీనామా చేయగా.. ఆస్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా కేసీఆర్ కు స‌న్నిహితంగా ఉండి ప‌నిచేసిన పొంగులేటి శ్రీ‌నివాస్ ను మ‌ళ్లీ పార్ల‌మెంట్ కు పించాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. ఎప్పటి నుంచో ఏ పదవీ లేక ఖాళీగా ఉన్న పొంగులేటిని సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పెద్దల సభకు పంపిచేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఏ స‌మ‌యంలోనైనా అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసే అవ‌కాశం ఉండ‌డంతో ఈ మేరకు పొంగులేటిని సిద్ధంగా ఉండాలని కూడా చెప్పినట్లు తెలుస్తోంది.

గ‌త పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఖ‌మ్మం ఎంపీ స్థానం నామాకు ఇచ్చారు. దీంతో అప్ప‌టి నుంచి పొంగులేటి ఏ పదవీ లేకుండా ఖాళీగా ఉంటున్నారు. టీఆర్ఎస్ ప‌లు మార్లు పొంగులేటికి హామీ ఇచ్చినా నెర‌వేర్చ‌లేక పోయింది. దీంతో ఆయ‌న కొన్ని రోజులుగా పార్టీ కార్య‌క‌లాపాలకు సైతం దూరంగా ఉంటున్నారు. టీఆర్‌ఎస్ లో ఆయన అసంతృప్తితో ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఖ‌మ్మంపై పొంగులేటికి గ‌ట్టి ప‌ట్టు ఉంది. ఇలాంటి స‌మ‌యంలో పొంగులేటిని దూరం చేసుకుంటే పార్టీకి క‌ష్ట‌కాలం వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అధిష్టానం భావిస్తోంది. దీంతో మిగిలిన రెండేళ్లకు గాను రాజ్యసభకు పొంగులేటిని పంపించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
1000 కార్లతో నామినేషన్!
పొంగులేటి శ్రీ‌నివాస్ ను రాజ్య‌స‌భ స్థానానికి ఎంపిక దాదాపు ఖ‌రారైన‌ట్లు తెలుస్తోంది. ఖాళీగా ఉన్న స్థానానికి ఈ నెల 12న నోటిఫికేషన్ విడుదల కానుండగా.. 30న పోలింగ్, ఓట్ల లెక్కింపు జరగనుంది. పొంగులేటి 1000 కార్లతో భారీ అనుచరగణంతో ఈ నెల 18వ తేదీన నామినేషన్ వేసేందుకు వెళ్తున్నట్లు విశ్వ‌స‌నీయ సమాచారం. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పొంగులేటి అత్యంత సన్నిహితులు, కొంతమంది అనుచరులకు సమాచారం కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. పొంగులేటి మంత్రి కేటీఆర్ అత్యంత సన్నిహితుల్లో ఒకడిగా ఉంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని కొంతమంది నేతలు పొంగులేటిపై ఎన్నోసార్లు ఆధిపత్యం చెలాయించినా.. మంత్రి కేటీఆర్ తో ఉన్న సాన్నిహిత్యం వల్ల భరిస్తూ వచ్చారు. కేటీఆర్ సైతం కచ్చితమైన హామీ ఇస్తూ వస్తున్నార. ఈ క్రమంలో రాజ్యసభకు ఎంపిక చేసినట్లు సమాచారం.


Tags:    

Similar News