పవన్ కల్యాణ్.. తప్పు చేస్తున్నావ్ : పోసాని

తాజాగా ఈ వ్యవహారంలోకి సినీ నటుడు, వైకాపా నేత పోసాని కృష్ణమురళి ఎంట్రీ ఇచ్చారు. పవన్ కల్యాణ్ ముద్రగడపై చేసిన వ్యాఖ్యలను..

Update: 2023-06-23 11:23 GMT

posani fires on pawan kalyan

ఏపీ రాజకీయాలు రోజురోజుకీ రసవత్తరంగా మారుతున్నాయి. అధికార పార్టీ వర్సెస్ ప్రతిపక్షాలు అన్నట్టుగా రాజకీయాలు సాగుతున్నాయి. గోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర చేస్తున్న పవన్ కల్యాణ్.. కాపు నేతలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి తో పాటు .. కాపునేత అయిన ముద్రగడను కూడా తిట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై ముద్రగడ ఇప్పటికే రెండుసార్లు పవన్ కు లేఖలు రాశారు. తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని లేఖలు పంపారు.

తాజాగా ఈ వ్యవహారంలోకి సినీ నటుడు, వైకాపా నేత పోసాని కృష్ణమురళి ఎంట్రీ ఇచ్చారు. పవన్ కల్యాణ్ ముద్రగడపై చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. పవన్ వ్యక్తిగతంగా మంచివాడేనన్న పోసాని.. చంద్రబాబు మాటలు విని ఇష్టారాజ్యంగా మాట్లాడటం సరికాదన్నారు. పవన్ కన్నా ముద్రగడ గొప్ప రాజకీయ నేత అని కొనియాడారు. ముద్రగడ ఏనాడు, ఏ విషయంలోనూ లంచాలు తీసుకున్న దాఖలాలు లేవని, అలాంటి నేతను దూషించడం మంచిదికాదన్నారు. ముద్రగడ పద్మనాభం రాజకీయంగా, ఆర్థికంగా లబ్ధి పొందలేదని, ఆయన గొప్ప నాయకుడని అన్నారు.
ఏ పార్టీలో ఏ కాపు నాయకుడున్నా.. ఆ నాయకుడు పనిచేస్తున్నాడా? లేదా? అన్నదానిపై ప్రశ్నిస్తే తప్పులేదు కానీ.. ఇలా తిట్టడం సబబు కాదన్నారు. పవన్ కల్యాణ్ గురించి చాలా ఊహించుకున్నానని, అతను రాజకీయాల్లోకి వచ్చాకే ఇలాంటి డిస్టర్బెన్సులు వచ్చాయన్నారు. వంగవీటి రంగాను చంద్రబాబే చంపించాడన్న విషయం ఆంధ్రా మొత్తం తెలుసని, ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి చంద్రబాబే కారణమన్న విషయం కూడా జగమెరిగిన సత్యమన్నారు. ఇదంతా తెలిసి కూడా చంద్రబాబుకు వంతపాడటం ఏమిటని ప్రశ్నించారు. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలను చంద్రబాబు కొన్నారని ఆరోపించారు.
ఏది ఏమైనా చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలని మాత్రం అనుకుంటే.. మున్ముందు చాలా ఘోరాలు చూడాల్సి ఉంటుందన్నారు. చంద్రబాబు రాజకీయంలో మీరంతా కొట్టుకుని ముక్కలుగా విడిపోతున్నారన్నారు. కాపులు ముఖ్యమంత్రి కావాలని.. పవన్ కల్యాణే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే.. కాపు సోదర సోదరీమణులకు ఓట్లు వేయాలని చెబుతామన్నారు. ఏ కారణంతో చంద్రబాబును పవన్ సపోర్ట్ చేస్తున్నాడో అర్థం కావట్లేదన్నాడు. నిజం చెప్పాలంటే.. పవన్ కల్యాణే చంద్రబాబు కంటే గొప్పవ్యక్తి అన్నారు. నీకంటే చంద్రబాబే మంచోడు అంటే.. నువ్వు రాజకీయాలకు పనికిరావు అని పోసాని కృష్ణమురళి పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.







Tags:    

Similar News