Raghuveera Reddy : రఘువీరా పోటీతో ఎవరికి లాభం..? ఈసారి గెలుపు ఎవరిదో డిసైడ్ చేసేది?
కల్యాణదుర్గం నియోజకవర్గం నుంచి మరోసారి రఘువీరారెడ్డి పోటీకి సిద్ధమవుతున్నారన్న ప్రచారం జరుగుతుంది;
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో అన్ని పార్టీలూ తమ అభ్యర్థులను సిద్ధం చేస్తున్నాయి. ప్రధానంగా టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉన్నాయి. ఈసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా టీడీపీ కూటమి ప్రయత్నిస్తుండగా, వైసీపీ మరోసారి పవర్‌లోకి వచ్చేందుకు ఎడాపెడా అభ్యర్థులను మార్చేస్తుంది. అయితే కొన్ని చోట్ల కాంగ్రెస్ కూడా ఈసారి పట్టుబిగించేందుకు సిద్ధమవుతుంది. అందులో కల్యాణదుర్గం నియోజకవర్గం ఒకటి. ఈసారి మరలా కాంగ్రెస్ నుంచి రఘువీరారెడ్డి పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. అయితే రఘువీరారెడ్డి పోటీ చేస్తే ఎవరికి లాభం? ఎవరికి నష్టం అన్న చర్చ జరుగుతుంది.
ఏ పార్టీలో అయినా...?
కల్యాణదుర్గం నియోజకవర్గంలో నేతలు ఎక్కువే. అలాగే పార్టీలో అసంతృప్తులూ మామూలుగా ఉండవు. అది వైసీపీలో కావచ్చు. ప్రతిపక్ష టీడీపీలో కావచ్చు. రెండు పార్టీల్లో గ్రూపుల గోలకు కొరత లేదు. టిక్కెట్ల కోసం ప్రయత్నించేవాళ్లు ఎక్కువ మంది ఉన్నట్లే.. ఒకరికి టిక్కెట్ దక్కితే మరొకరు సహకరించుకోని పరిస్థితి కూడా ఈ నియోజకవర్గంలోనే చూస్తాం. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కల్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రస్తుతం మంత్రి ఉషశ్రీ చరణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈసారి ఆమెకు టిక్కెట్ ఇవ్వబోమని అధినాయకత్వం తెలిపింది. ఉషశ్రీ చరణ్ ను పెనుకొండకు పంపాలని డిసైడ్ అయింది. దీంతో కల్యాణదుర్గం నుంచి శంకరనారాయణను పోటీకి దింపే అవకాశాలున్నాయి.
గ్రూపుల గోలతో...
మరోవైపు తెలుగుదేశం పార్టీలోనూ కల్యాణదుర్గం నియోజకవర్గంలో గ్రూపులున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరితో టీడీపీ ఇన్‌ఛార్జి ఉమామహేశ్వరనాయుడుల మధ్య విభేదాలున్నాయి. ఇద్దరూ మరోసారి సీట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఎవరికి సీటు ఇస్తారన్న దానిపై ఇంత వరకూ క్లారిటీ రాలేదు. ఒకరికి సీటు ఇస్తే మరొకరు సహకరించుకునే పరిస్థితి సైకిల్ పార్టీలో లేదు. అనేక సార్లు రెండు గ్రూపులు కొట్టుకున్నాయి. ఈ నియోజకవర్గం టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. టీడీపీకి బలమైన నియోజకవర్గమిది. టీడీపీ ఆవిర్భవించాక ఐదు సార్లు విజయం సాధించింది. 2014లో ఇక్కడ టీడీపీ గెలిచినా.. 2019 ఎన్నికల్లో ఓటమి పాలయింది. అందుకోసమే ఈసారి ఇక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై ఇంకా పార్టీ అధినేత నిర్ణయం తీసుకోలేదు.
రఘువీరా పోటీ చేస్తే...
ఈ పరిస్థితుల్లో కల్యాణదుర్గం నుంచి కాంగ్రెస్ మాజీ పీీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. ఆయన కాంగ్రెస్ నుంచి 2009లో గెలుపొందారు. అప్పుడు మంత్రిగా పనిచేసిన రఘువీరారెడ్డి చేసిన అభివృద్ధి పనులు తిరిగి ఆయనను గెలిపిస్తాయన్న నమ్మకంతో ఆ పార్టీ ఉంది. దీంతో పాటు రఘువీరారెడ్డి గత కొంతకాలంగా తన సొంత గ్రామంలోనే ఉంటూ అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. నీలకంఠాపురంలో ఆలయాలను నిర్మించడమే కాకుండా అక్కడే నివాసం ఏర్పరుచుకుని సాదాసీదా జీవితం గడుపుతుండటం ఆయనకు ప్లస్ అవుతుందని చెబుతున్నారు. బీసీ కావడంతో అదనపు అడ్వాంటేజీ అవుతుంది. దీంతో రఘువీరారెడ్డి పోటీ చేస్తే టీడీపీకి లాభమా? లేదా వైసీపీకి లాభమా? అన్న చర్చ మొదలయింది. మరోసారి రఘువీరారెడ్డి కల్యాణదుర్గం నుంచి పోటీ చేయడం ఖాయమని చెబుతుండటంతో ఈ సీటు రాష్ట్రంలోనే హాట్ సీటుగా మారనుంది.