మే 6న వరంగల్ కు రాహుల్ గాంధీ రాక..!

మే 7న రాహుల్ గాంధీ హైదరాబాద్ లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో సమావేశం నిర్వహించనున్నారు. ఇదే కార్యక్రమంలో..

Update: 2022-04-17 07:40 GMT

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో తిరిగి సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీని తెలంగాణకు ఆహానిస్తూ ఉంది. రాహుల్ గాంధీ వచ్చే నెల (మే) 6న వరంగల్ లో పర్యటించనున్నారు. కాంగ్రెస్ పార్టీ 'రైతు సంఘర్షణ సభ' పేరుతో ఒక బహిరంగ సభ నిర్వహించనుంది. మరుసటి రోజు మే 7న రాహుల్ గాంధీ హైదరాబాద్ లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో సమావేశం నిర్వహించనున్నారు.

ఇదే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కూడా పాల్గొననున్నారు. 2023 అసెంబ్లీ, 2024 లోక్ సభ ఎన్నికలపై చర్చించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. టీఆర్ఎస్, బీజేపీ ఆడుతున్న రాజకీయ డ్రామాలను ప్రజలకు తెలియచెప్పడమే రాహుల్ బహిరంగ సభ ఉద్దేశ్యమని పార్టీ వర్గాలు అంటున్నాయి. రైతులను ఆదుకోవడంలో పాలక పక్షాల తీరును ఎండగట్టడంతోపాటు, వారికి అండగా కాంగ్రెస్ ఉందని చెప్పడమే సభ లక్ష్యంగా పేర్కొన్నాయి. 2019 లోక్ సభ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ తెలంగాణకు రావడం ఇదే మొదటిసారి కానుంది.

ఇటీవల ఇందిరాభవన్‌లో ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి మాణికం ఠాగూర్ అధ్యక్షతన జరిగిన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో పార్టీని అట్టడుగు స్థాయిలో బలోపేతం చేయడంతోపాటు టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవడంపై నేతలు దృష్టి సారించారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన, వరంగల్‌లో బహిరంగ సభపై చర్చలు కూడా జరిగాయి. ఇటీవల న్యూఢిల్లీ పర్యటన సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు గాంధీని తెలంగాణకు రావాలని కోరారు.
పార్టీ నేతలతో వరుస సమావేశాల అనంతరం రేవంత్ మాట్లాడుతూ.. 'అస్తవ్యస్తమైన పాలన' వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, రైతుల సమస్యను పార్టీ సీరియస్‌గా తీసుకుంటుందని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటికే వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు.


Tags:    

Similar News