సీటు మార్చ‌నున్న రేవంత్ రెడ్డి ? ఈసారి కొత్త నియోజ‌కవ‌ర్గం నుంచి పోటీ ?

రేవంత్ రెడ్డి స్వ‌స్థ‌లం ప్ర‌స్తుత నాగ‌ర్‌క‌ర్నూలు జిల్లాలోని కొండారెడ్డిప‌ల్లె గ్రామం. ఇది అచ్చంపేట నియోజ‌క‌వ‌ర్గంలోకి వ‌స్తుంది. అయితే, ఈ నియోజ‌క‌వ‌ర్గం

Update: 2022-05-10 05:10 GMT

హైదరాబాద్ : టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎక్క‌డి నుంచి పోటీ చేస్తార‌నే అంశంపై కాంగ్రెస్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. కొడంగ‌ల్ నుంచి ఈసారి ఆయ‌న పోటీ చేయ‌ర‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. కొత్తగా రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ రెడ్డి దృష్టి పెట్టార‌ని... ఈ రెండింటిలో ఒక ద‌గ్గ‌ర నుంచి పోటీ చేస్తే బాగుంటుంద‌నే ఆలోచ‌న‌తో ఉన్న‌ట్లు వినికిడి. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ సులువుగా గెలిచే అవ‌కాశాలు ఉన్నాయ‌ని సైతం లెక్క‌లు వేసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

రేవంత్ రెడ్డి స్వ‌స్థ‌లం ప్ర‌స్తుత నాగ‌ర్‌క‌ర్నూలు జిల్లాలోని కొండారెడ్డిప‌ల్లె గ్రామం. ఇది అచ్చంపేట నియోజ‌క‌వ‌ర్గంలోకి వ‌స్తుంది. అయితే, ఈ నియోజ‌క‌వ‌ర్గం ఎస్సీ రిజ‌ర్వుడ్ కావ‌డంతో ఎమ్మెల్యేగా త‌న రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని ఆయ‌న కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రారంభించారు. 2009, 2014 ఎన్నిక‌ల్లో కొడంగ‌ల్ నుంచి విజ‌యం సాధించి ఇక్క‌డ బ‌ల‌మైన నాయ‌కుడిగా ఎదిగారు. అయితే, కొడంగ‌ల్‌లో రేవంత్ రెడ్డిని ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ ప్ర‌త్యేక దృష్టి పెట్ట‌డం, అన్ని శక్తులూ ప్ర‌ద‌ర్శించ‌డంతో 2018 ఎన్నిక‌ల్లో ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డిపైన‌ రేవంత్ రెడ్డి ఓట‌మిపాల‌య్యారు.
అనంత‌రం 2019లో మ‌ల్కాజ్‌గిరి ఎంపీ స్థానానికి రేవంత్ రెడ్డి పోటీ చేసి అనూహ్యంగా విజ‌యం సాధించారు. నిజానికి, మ‌ల్కాజ్‌గిరి ఎంపీ స్థానంపై రేవంత్ రెడ్డికి ముందునుంచే ఎక్కువ ఆస‌క్తి ఉండేది. 2014లో కూడా టీడీపీ నుంచి ఇక్క‌డ పోటీ చేయ‌డానికి ఆయ‌న ప్ర‌య‌త్నించినా చివ‌ర‌కు మ‌ల్లారెడ్డికి చంద్ర‌బాబు టిక్కెట్ ఇచ్చారు. 2019లో మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంటు ప‌రిధిలోని ఉప్ప‌ల్‌, ఎల్బీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గాల్లో రేవంత్ రెడ్డికి మెజారిటీ వ‌చ్చింది. ఎంపీగా ఆయ‌న గెల‌వ‌డానికి ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాలే ప్ర‌ధాన కార‌ణం.
దీంతో రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఈ రెండు స్థానాల్లో ఏదైనా ఒక స్థానం నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేయ‌బోతున్నార‌నే ప్ర‌చారం కాంగ్రెస్ వ‌ర్గాల్లో జ‌రుగుతోంది. ముందుగా ఉప్ప‌ల్ సంగ‌తి చూస్తే... ఇక్క‌డ కాంగ్రెస్ క్యాడ‌ర్ బ‌లంగా ఉంది. జీహెచ్ఎంసీలోని 150 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచిన రెండు డివిజ‌న్లు ఈ నియోజ‌క‌వ‌ర్గంలోనివే కావ‌డం విశేషం. ఇక్క‌డ న‌లుగురు నాయ‌కులు కాంగ్రెస్ టిక్కెట్‌ను ఆశిస్తున్నారు. కానీ, ఎవ‌రికీ రేవంత్ రెడ్డి నుంచి టిక్కెట్‌పైన మాత్రం చిన్న హామీ కూడా రాలేదు. కాబ‌ట్టి, ఉప్ప‌ల్ నుంచి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగుతారా అనే అనుమానాలు బ‌ల‌ప‌డుతున్నాయి.
ఎల్బీన‌గ‌ర్‌లో 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌పున సుధీర్ రెడ్డి గెలిచారు. 2019 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి ఆయ‌న టీఆర్ఎస్‌లోకి వెళ్లిపోయినా ఇక్క‌డ కాంగ్రెస్‌కే మెజారిటీ వ‌చ్చింది. కాబ‌ట్టి, ఎల్బీన‌గ‌ర్‌లో కాంగ్రెస్‌కు బ‌ల‌మైన ఓటుబ్యాంకు ఉంద‌ని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇక్క‌డి నుంచి కూడా రేవంత్ రెడ్డి సులువుగా గెల‌వ‌వ‌చ్చ‌ని కాంగ్రెస్ నేత‌లు భావిస్తున్నారు. అయితే, ఇక్క‌డ మ‌ల్‌రెడ్డి రాంరెడ్డి అనే నేత కాంగ్రెస్‌ ఇంఛార్జిగా ఉన్నారు. ఒక‌వేళ రేవంత్ ఇక్క‌డి నుంచి పోటీ చేస్తే ఆయ‌న ప‌రిస్థితి ఏంట‌నేది చూడాల్సి ఉంది.
ఉప్ప‌ల్ లేదా ఎల్బీన‌గ‌ర్ నుంచి రేవంత్ పోటీ చేయాల‌నుకోవ‌డం వెనుక ప‌క్కా రాజ‌కీయ వ్యూహం కూడా ఉంద‌ని తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ప‌రిధిలోని 22 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ బ‌ల‌హీనంగా ఉంది. రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఈ స్థానాల్లో క‌నీసం ఆరేడు స్థానాలైనా గెలుచుకోవాలి. రేవంత్ రెడ్డి క‌నుక ఇక్క‌డి నుంచి పోటీ చేస్తే ఆ ప్ర‌భావం మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాల‌పైన కూడా ప‌డి కొంత మేర‌కు క‌లిసి వ‌స్తుంద‌నే ఆశ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉంది. ఒక‌వేళ రేవంత్ రెడ్డి క‌నుక ఈ రెండు సీట్ల‌లో ఒక ద‌గ్గ‌ర నుంచి పోటీ చేస్తే కొడంగ‌ల్ నుంచి ఆయ‌న త‌మ్ముడిని పోటీ చేయిస్తార‌నే ప్ర‌చారం ఉంది.


Tags:    

Similar News