Ys Jagan : ఏం మనిషమ్మా... కూర్చున్న చోట నుంచి కదలడేంటీ?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ దూరంగా ఉండటం పార్టీ క్యాడర్ ను నిరాశలోకి నెడుతుంది.;

వైసీపీ అధినేత వైఎస్ జగన్ దూరంగా ఉండటం పార్టీ క్యాడర్ ను నిరాశలోకి నెడుతుంది. తాము కష్టాల్లో ఉంటే జనంలోకి రావాల్సిన జగన్ ఇప్పటి వరకూ బయటకు రాకుండా కాలయాపన చేయడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. వరసగా తమపై కేసులు నమోదవుతుండటంతో పాటు, ప్రశ్నించిన వారిని లోపల పడేస్తున్నా జగన్ మాత్రం బెంగళూరులో సేదతీరటం ఏంటని క్యాడర్ ప్రశ్నిస్తుంది. సంక్రాంతి తర్వాత జనంలోకి వస్తానన్న జగన్ మూడు నెలలు దాటుతున్నా ఇంకా జనంలోకి రాకుండా పొరుగు రాష్ట్రంలోనే విశ్రాంతి తీసుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. కీలక నేతలు కూడా వరసగా అరెస్ట్ లు అవుతున్నా కేవలం ఓదార్చడం మినహా పట్టించుకోకుండా కర్ణాటకలో కూర్చోవడమేంటని నిలదీస్తున్నారు.
ఏడాది కావస్తున్నా...
ఎన్నికలు జరిగి ఏడాది కావస్తుంది. ఇక పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకోవాల్సిన అవసరం జగన్ కు ఉంది. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబు చేతులు ముడుచుకుని కూర్చోలేదు. వెంటనే ఓటమి నుంచి తేరుకుని ఆయన జిల్లాల బాట పట్టారు. కానీ జగన్ మాత్రం ఎన్నికలు జరిగి ఏడాది గడుస్తున్నా అడపా దడపా తాడేపల్లికి వచ్చి వెళ్లడం మినహా జిల్లాలకు రావడం లేదన్న విమర్శలు సొంత పార్టీ నుంచి వినపడుతున్నాయి. అసలు పార్టీని బలోపేతం చేసే ఉద్దేశ్యం జగన్ కు ఉందా? లేదా? అని కూడా కొందరు నిలదీస్తున్నారు. కొన్ని చోట్ల ఘర్షణలు జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ లోకల్ లీడర్స్ గట్టిగా నిలబడిన వారికి ఒక అభినందన పత్రికాముఖంగా పెట్టడం తప్ప వారిని కలిసేందుకు ప్రయత్నం చేయడం లేదని అంటున్నారు.
జెండా మోసిన వారిని...
స్థానిక సంస్థల్లో గెలిచిన ఆనందాన్ని కూడా తమతో పంచుకోవడం లేదని వారు బాధపడిపోతున్నారు. అనేక చోట్ల ప్రలోభాలు పెడుతున్నా అన్నీ తట్టుకుని పార్టీ జెండాను పట్టుకుని నిలబడ్డ తమకు అండగా నిలవాల్సిన సమయంలో జగన్ ఇలా వ్యవహరించడంపై తప్పుపడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వరసగా దాడులు, కేసులు నమోదవుతున్నాయని, అనేక పింఛన్లు తొలగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం కనిపించడం లేదని వారు వాపోతున్నారు. ఈ సమయంలో సంక్రాంతి తర్వాత అని ఒకసారి, ఉగాదికి అని మరోసారి ఇలా వాయిదాలు వేసుకుంటూ జగన్ కాలయాపన చేస్తున్నారన్న విమర్శలు క్యాడర్ నుంచి ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ఇదే మంచి సమయం అంటూ...
వైఎస్ జగన్ వయసులో ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. ఏప్రిల్, మే నెల నుంచి కొన్ని కీలక హామీలు అమలు కానున్నాయి. ఈ లోపు జనం బాట పడితే రెస్పాన్స్ బాగా వస్తుందని, ప్రజలు కూడా వైసీపీకి అండగా నిలుస్తారని, క్యాడర్ లోనూ ధైర్యం నెలకొంటుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. జగన్ వస్తాడని ఎన్ని రోజులు ఎదురు చూడాలంటూ సోషల్ మీడియాలో కొందరు నేరుగానే ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించి తిరిగి అక్కడ పార్టీకి పూర్వ వైభవం తేవాలంటే జగన్ బయటకు రావాలని క్యాడర్ కోరుకుంటుంది. కానీ జగన్ మాత్రం కదలడం లేదు.