Jaggareddy : కొందరంతే... గెలవాల్సిన టైం లో గెలవలేరు... పదవులను పొందలేరు
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి ఓటమి పాలయి మంత్రి పదవిని మిస్ చేసుకున్నారు
కొందరు నేతలుంటారు.. గెలవాల్సిన సమయంలో గెలవరు.. అవసరం లేని వేళ గెలుస్తారు. పాపం వాళ్ల తలరాత అంతేనని అనుకోవాలి. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి ఇందులో ఒకరు. జగ్గారెడ్డి కాంగ్రెస్ లో సీనియర్ నేత. ఆయన పార్టీలో పలు పదవులు కూడా పొందారు. ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన జగ్గారెడ్డి 2018లో దాదాపు పన్నెండు మంది పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరినా జగ్గారెడ్డి మాత్రం అందులోనే కొనసాగారు. నిర్మొహమాటంగా తాను అనుకున్నది అనుకున్నట్లు బయటకు చెప్పే జగ్గారెడ్డి అంటే పార్టీలోనూ కొందరికి గిట్టదు. అదే ఆయనకు మైనస్. అదే ఆయనకు ప్లస్ అని చెప్పాలి. అటువంటి జగ్గారెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వేళ ఆయన ఓటమి పాలు కావడం ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
నాలుగోసారి గెలుపు కోసం...
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి 2004, 2009లో విజయం సాధించారు. అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. తర్వాత 2014లో ఓటమి పాలయినా 2018 ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఏర్పడిన పదేళ్లు కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడంతో ఆయనకు ఏ పదవి దక్కలేదు. ఇప్పటికి సంగారెడ్డి నియోజకవర్గంలో మూడు సార్లు గెలిచిన జగ్గారెడ్డి నాలుగోసారి కూడా విజయం తనదేనన్న ధీమాలో ఉన్నారు. సంగారెడ్డి లో ఇక తిరుగులేదని భావించారు. అందులో కాంగ్రెస్ వేవ్ ఉండటంతో తన గెలుపునకు ఇక ఢోకా ఉండదని కూడా నిర్ణయించుకున్నారు. అయితే జగ్గారెడ్డి జాతకం తిరగబడింది. ఆయన ఓటమి పాలు అయ్యారు. తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ చేతిలో దాదాపు ఎనిమిది వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
గెలిచి ఉంటే...
కాంగ్రెస్ గెలిచి ఉంటే ఖచ్చితంగా జగ్గారెడ్డికి మంత్రి పదవి దక్కేది. సీనియర్ నేత కావడం. పార్టీనే నమ్ముకుని ఉండటంతో ఆయనకు గ్యారంటీగా ఏదో ఒక కీలకమైన పదవే దక్కి ఉండేది. జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో అనేక మార్లు విభేదించారు. రేవంత్ వర్గం తనను సోషల్ మీడియాలో టార్గెట్ చేసిందని, తనను బీఆర్ఎస్ కోవర్టు అంటూ రేవంత్ వర్గం తనను సోషల్ మీడియాలో పదే పదే వేధిస్తుందంటూ మీడియా సమావేశాలు పెట్టి ఫైర్ అయ్యారు కూడా. అనేకసార్లు రేవంత్ తో విభేదించిన జగ్గారెడ్డి అన్నే సార్లు చేతులు కూడా కలిపారు. కానీ జగ్గారెడ్డి ఈ సారి ఓటమి పాలు కావడంతో ఆయన ప్రభుత్వంలో కీలక పొందే అవకాశాన్ని మిస్ అయినట్లే. మరి ఆయన చేసిన సేవలు, పార్టీ పట్ల చూపిన అంకితభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైనా పార్టీ పదవి ఇస్తుందో చూడాలి మరి.