Vemireddy : నువ్వు రావాలయ్యా.. రా.. రా.. రా నువ్వు కావాలయ్యా

వైసీపీకి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని టీడీపీలోకి తీసుకు వచ్చేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు

Update: 2024-02-22 11:38 GMT

వైసీపీకి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని టీడీపీలోకి తీసుకు వచ్చేందుకు నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. నిన్న వైసీపీ ప్రాధమిక సభ్యత్వానికి, రాజ్యసభ పదవికి వేమిరెడ్డి దంపతులు రాజీనామా చేశారు. నిన్ననే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు కలిశారు. నేడు కూడా వరసగా నేతలు ఆయనను కలుస్తున్నారు. ఈరోజు మాజీ మంత్రి నారాయణ వేమిరెడ్డి ఇంటికి వెళ్లి వేమిరెడ్డితో చర్చలు జరిపారు. టీడీపీలోకి రావాలని, పార్టీలో సముచిత స్థానం దక్కుతుందని చెప్పడంతో ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది.

బలమైన నేత....
నిజానికి నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేసేందుకు బలమైన నేత టీడీపీ నేత ఎవరూ లేరు. నెల్లూరు జిల్లా వైసీపీికి కంచుకోట కావడంతో ఆ పార్లమెంటు స్థానాన్ని దక్కించుకోవడం కష్టంగా మారింది. నిన్నటి వరకూ నెల్లూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాల్సిందిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని పార్టీ కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇందుకు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సుముఖత వ్యక్తం చేయలేదు. తాను మరోసారి సర్వేపల్లి నుంచి పోటీ చేస్తానని ఆయన చెప్పడంతో పార్లమెంటు అభ్యర్థి కోసం టీడీపీకి పెద్ద సమస్యగా మారింది.
అభ్యర్థి నిన్నటి వరకూ...
గత ఎన్నికల్లో పోటీ చేసిన బీద మస్తాన్‌రావు వైసీపీలో చేరడంతో కొత్త వ్యక్తి ఎవరా? అన్న కోణంలో టీడీపీ అన్ని కోణాల్లో అనేక పేర్లను పరిశీలిస్తుంది. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎదుర్కొనే నేత ఎవరన్నది వారికి నిన్నమొన్నటి వరకూ అర్థం కాని పరిస్థితి. కానీ ఈరోజు మాత్రం సీన్ రివర్స్ అయింది. అదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేయడంతో ఆయనను పార్టీలోకి తీసుకురావాలని, ఇంటికి వెళ్లి ఆహ్వానించాలని చంద్రబాబు నెల్లూరు జిల్లా నేతలను ఆదేశించారు. ఆఘమేఘాల మీద వేమిరెడ్డి ఇంట్లో టీడీపీ నేతలు వాలిపోయారు.
టీడీపీకి ఊరట...
ఇప్పుడు టీడీపీకి ఊరట కలిగింది. వేమిరెడ్డి తమ పార్టీ అభ్యర్థి అయితే కేవలం పార్లమెంటు మాత్రమే కాదు.. ఆ ఎఫెక్ట్ నెల్లూరు జిల్లా మొత్తం మీద పడుతుందన్న అంచనాలో చంద్రబాబు ఉన్నారు. వేమిరెడ్డిని పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయించడంతో పాటు ఆ నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలను గెలిపించుకుని వచ్చే బాధ్యతలను కూడా వేమిరెడ్డిపైనే పెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. త్వరలోనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరనున్నారు. ఆయనతో పాటు ఆయన భార్యకు కూడా నెల్లూరు జిల్లాలో ఒక స్థానం నుంచి పోటీ చేయించాలని కూడా చంద్రబాబు డిసైడ్ అయినట్లు తెలిసింది.


Tags:    

Similar News