Pawan Kalyan : పవన్ చేసిన ఆ కామెంట్స్ కు కాపులు రగిలిపోతున్నారటగా

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై కాపు సామాజికవర్గం ఆగ్రహంగా ఉన్నట్లు కనపడుతుంది;

Update: 2025-03-31 06:02 GMT
kapu community, angry, pawan kalyan, ap politics
  • whatsapp icon

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై కాపు సామాజికవర్గం ఆగ్రహంగా ఉన్నట్లు కనపడుతుంది. తరచూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు తననే కాకుండా కాపు సమాజికవర్గాన్ని కించపర్చే విధంగా ఉన్నాయన్న ఆవేదన వారిలో కనపడుతుంది. నిన్న అమరావతిలో జరిగన పీ4 పథకం ప్రారంభం కార్యక్రమంలో కూడా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ట్యాగ్ చేస్తూ కొందరు సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెడుతున్నారు. మన వద్ద సత్తా లేనప్పుడు.. సత్తా, ప్రతిభ, బలం , సమర్థత, తెలివితేటలు ఉండే నాయకుడికి మద్దతివ్వాలని తాను అనుకున్నట్లు ఆయన చంద్రబాబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆయనకు మద్దతు ఇస్తే ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని చేసిన వ్యాఖ్యలు తమకు ఇబ్బందికరంగా మారాయంటున్నారు.

కాపు ఓటర్లు ఎక్కువ ఉన్నా...
ఆంధ్రప్రదేశ్ లో అధిక శాతం కాపు సామాజికవర్గ ఓటర్లున్నారు. కొన్ని జిల్లాల్లో వారే శాసిస్తారు. కాపులు ముఖ్యమంత్రి కావాలని గత కొంతకాలంగా కోరుకుంటున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అది సాధ్యం కావడం లేదు. టీడీపీ అధికారంలోకి వస్తే కమ్మ, వైసీపీ అధికారంలోకి వస్తే రెడ్డి సామాజికవర్గం తప్ప కాపులుకు అవకాశం ఉండదు. అలాంటి సమయంలో జనసేన పార్టీని తమ సొంత పార్టీగా భావించామని, అధికారం దిశగా అడుగులు వేయాలి తప్పించి, ఒకరి చేయి కింద నీళ్లు తాగడమేంటని కొందరు నేరుగా సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. సత్తా లేదని ఒప్పుకోవడమంటే రాజకీయంగా విఫలమయినట్లేగా? అని మరికొందరు నేరుగానే నిలదీస్తున్నారు.
నాడు అన్న కూడా...
2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా కాపు సామాజివర్గం ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావడంతో పెద్దగా ప్రజారాజ్యానికి జనం నుంచి ఆమోదం లభించలేదు. చిరంజీవి చరిష్మా కూడా నాడు సరిపోకపోవడంతో కేవలం పద్దెనిమిది సీట్లకే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో తర్వాత ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో చిరంజీవి విలీనం చేయడాన్ని కూడా కొందరు తప్పుపట్టారు. ఇప్పుడు తమ్ముడు కూడా తెలుగుదేశంతో జత కలసి తన పార్టీని తానే కించపర్చుకునే విధంగా మాట్లాడటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సత్తా లేదని చెప్పడం అంటే ఎన్నికల్లో పనిచేసిన కార్యకర్తలు, అభిమానులను కించపర్చడమే కదా? అని వారు అంటున్నారు.
వరస పొగడ్తలతో...
పవన్ కల్యాణ్ కేవలం చంద్రబాబును పొగడ్తలకే పరిమితమయినట్లు కనిపిస్తుందని, కనీసం హామీలు అమలు చేయాలని నిలదీసే శక్తిని కూడా కోల్పోయిన పవన్ కల్యాణ్ తన బలహీనతను ఇలా బయటపెట్టుకుంటున్నారన్న విమర్శలు నెట్టింట జోరుగా వినిపిస్తున్నాయి. మిత్రపక్షంగా ఒకసారి ప్రశంసలు కురిపించడం వేరు. కానీ వీలు చిక్కినప్పుడల్లా పొగడ్తలతో ముంచెత్తడమంటే పార్టీ క్యాడర్ ను నిరాశలోకి నెట్టడమేనని, అలాగే వెన్నుదన్నుగా నిలిచిన కాపు సామాజికవర్గాన్ని కూడా కించపర్చినట్లేనన్న అభిప్రాయం సోషల్ మీడియాలో వ్యక్తమవుతుంది. సత్తా లేకపోతే.. ఎందుకు పార్టీ పెట్టాలి? ఎందుకు పోటీ చేయాలి? అని కొందరు ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద పవన్ సద్దుద్దేశ్యంతో చేసిన వ్యాఖ్యలు కూడా బయటకు వెళ్లేసరికి అవి వేరే రూట్ కు వెళుతున్నట్లు కనిపిస్తుంది.


Tags:    

Similar News