వైసీపీకి స్వీట్‌ షాక్‌.. పావులు కదుపుతోన్న టీడీపీ

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు మరో 9 నెలల సమయం మిగిలి ఉండగానే.. రాజకీయాలు వాడి వేడీగా సాగుతున్నాయి. ఈ సారి ఎలాగైనా

Update: 2023-06-10 11:47 GMT

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు మరో 9 నెలల సమయం మిగిలి ఉండగానే.. రాజకీయాలు వాడి వేడీగా సాగుతున్నాయి. ఈ సారి ఎలాగైనా అధికార పగ్గాలు చేపట్టేందుకు టీడీపీ తన శక్తి మేర ప్రయత్నాలు చేస్తోంది. ఓ వైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ 'యువగళం' పేరుతో పాదయాత్ర చేస్తుంట.. మరోవైపు టీడీపీ చీఫ్‌ చంద్రబాబు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీని దెబ్బ కొట్టేందుకు చంద్రబాబు సీఎం వైఎస్‌ జగన్‌ సామాజిక వర్గానికి చెందిన రెడ్డి సామాజికవర్గం నేతలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వైసీపీ పాలనలో రెడ్డి సామాజికవర్గం అసంతృప్తితో ఉన్నారని కొద్ది రోజుల కిందట చంద్రబాబు కామెంట్‌ చేశారు. ఈ క్రమంలోనే వైసీపీలోని అసంతృప్త రెడ్డి నేతలపై టీడీపీ ప్రత్యేక దృష్టి పెట్టింది.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారన్న ఆరోపణలపై పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను వైసీపీ సస్పెండ్‌ చేసింది. ఆ ముగ్గురు కూడా నెల్లూరు జిల్లాలోని బలమైన నేతలు, దాంతో పాటు వారు రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు కావడం విశేషం. ఈ నేపథ్యంలోనే నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డిలకు పసుపు కండువా కప్పేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు. నిన్న రాత్రి ఆనం రాంనారాయణరెడ్డి చంద్రబాబును కలిశారు. ఆయన టీడీపీ చేరడానికి ఆసక్తి చూపినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో టీడీపీ నేతలు బీద రవిచంద్ర, మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి చర్చలు జరిపి.. తమ పార్టీలోకి ఆహ్వానించారు.

ఇక మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అయితే స్వయంగా యువగళం పాదయాత్ర జరుగుతున్న కడప జిల్లాలోని బద్వేలుకు వెళ్లి మరీ నారా లోకేష్‌తో మంతనాలు జరిపారు. ఆయన కూడా టీడీపీలో చేరడానికి ఆసక్తితో ఉన్నారని తెలుస్తోంది. లోకేష్‌ కూడా మేకపాటిని పార్టీలోకి ఆహ్వానించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే.. మరో మూడు రోజుల్లో (జూన్‌ 13న) లోకేష్‌ పాదయాత్ర నెల్లూరు జిల్లాలో ప్రవేశించబోతోంది. ఈ క్రమంలోనే వైసీపీకి కంచుకోటగా ఉన్న నెల్లూరులోని.. ఆ పార్టీకి షాకిచ్చే దిశగా టీడీపీ వ్యూహాలు పన్నుతోంది. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నెల్లూరు జిల్లాలో క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఈ క్రమంలోనే ఈసారి జిల్లాలో వైసీపీకి గట్టి దెబ్బ తగిలేలా టీడీపీ పావులు కదుపుతోంది. మరీ ఈ ముగ్గురు వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు టీడీపీలో చేరతారా? లేదా? అనేది త్వరలో తెలియనుంది. 

Tags:    

Similar News