పవర్ "అస్త్ర"

తెలంగాణ కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేందుకు అన్ని రకాలుగా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంది.

Update: 2023-09-18 04:01 GMT

తెలంగాణ కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేందుకు అన్ని రకాలుగా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంది. ఇప్పటికే రేసులో ముందున్న కాంగ్రెస్ పార్టీ ఇక వెనక్కు తగ్గేందుకు ఇష్టపడటం లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా అధికారాన్ని చేజిక్కించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. వరసగా రెండుమార్లు విఫలమవ్వడంతో ఈసారి గోల్ కొట్టాల్సిందేనన్న కసి ప్రతి కాంగ్రెస్ నేత, కార్యకర్తలో కనపడుతుంది. ఆ దిశగానే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

సభ సక్సెస్...
నిన్న తుక్కుగూడలో జరిగన కాంగ్రెస్ సభ విజయవంతమయిందనే చెప్పాలి. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు. పార్టీ జాతీయ నేతలందరూ కొలువుదీరిన ఈ సభలో శాసనసభ ఎన్నికలే టార్గెట్ గా అనేక హామీలను ఇచ్చింది. గ్యారంటీ కార్డును ప్రజల ముందు ఉంచింది. తాము అధికారంలోకి వచ్చి తొలి కేబినెట్ సమావేశంలోనే గ్యారంటీ కార్డును అమలు చేస్తామని స్వయంగా రాహుల్ గాంధీ హామీ ఇవ్వడం ఈ సందర్భంగా విశేషం. అన్ని రంగాల ప్రజలను ఆకట్టుకునే విధంగా ఆరు హమీలతో గ్యారెంటీ కార్డును రూపొందించారు.
అన్ని వర్గాలను...
మహిళలు, రైతులు, యువత, అమరవీరుల కుటుంబాలతో పాటు విద్యుత్తు, వ్యవసాయ రంగంపై వరాల వర్షం కురిపించారు. నిజానికి ఈ హామీలన్నీ అమలు అయితే అనేక మంది పేదలు సంతోషం వ్యక్తం చేస్తారు. కర్ణాటక తరహాలోనే ఇక్కడ కూడా గ్యారంటీ కార్డును అమలు చేస్తామని, తమను నమ్మమని కాంగ్రెస్ అగ్రనేతలు మూకుమ్మడిగా కోరడం ఇందులో విశేషం. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీతో పాటు రాహుల్ గాంధీ కూడా ఈ సభకు హాజరై గ్యారంటీ కార్డు విడుదల చేయడం సభకు మరింత శోభను తెచ్చిపెట్టింది.
గ్యారెంటీతో గవర్నమెంట్...
కాంగ్రెస్ సభ పూర్తిగా సక్సెస్ కావడంతో పార్టీ నేతలతో పాటు శ్రేణులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. నేటి నుంచి గ్యారంటీ కార్డును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రచార కార్యక్రమం చేపడుతున్నాయి. ప్రజల్లో తమ అగ్రనేతలు ఇచ్చిన హామీలను తీసుకెళ్లి ఈ ఎన్నికల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ నేతలున్నారు. నియోజకవర్గాల్లో ఈ పర్యటనలు నేటి ప్రారంభం కానున్నాయి. ఈ గ్యారెంటీ నమ్మితే తమ గవర్నమెంట్ గ్యారెంటీ అని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఆ దిశగానే త్వరగానే అభ్యర్థుల ఎంపిక కూడా ఉంటుందని, తొలిదశలో నలభై మంది అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ హైకమాండ్ విడుదల చేయనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరి ఈసారి హస్తవాసి ఎలా ఉంటుందో? చూడాలి మరి.


Tags:    

Similar News