వచ్చే ఎన్నికల్లో గద్దర్ కుమారుడికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వనుందా..?
ప్రజాగాయకుడు గద్దర్ మరణం పట్ల ఎంతో మంది షాక్‌కు గురయ్యారు. రాజకీయాలకు, సిద్ధాంతాలకు..
ప్రజాగాయకుడు గద్దర్ మరణం పట్ల ఎంతో మంది షాక్‌కు గురయ్యారు. రాజకీయాలకు, సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే గద్దర్ ఇక లేరన్న విషయం అందరిలో విషాదాన్ని నింపింది. గద్దర్ అంతిమ యాత్రలో రాజకీయ ప్రముఖులు, మేధావులు ఇలా వేలాది మంది పాల్గొని నివాళులు అర్పించారు. అయితే అన్ని పార్టీలతో పోల్చుకుంటే కాంగ్రెస్ ఆయన చివరి మజిలిలో అంతా తానై వ్యవహరించేందుకు గద్దర్ ప్రయత్నించారు. గద్దర్ ఇకలేరన్న విషయం తెలిసినప్పటి నుంచి అంత్యక్రియలు పూర్తయ్యే వరకు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో పాటు బట్టి విక్రమార్క ,సీతక్క, వీహెచ్, మల్లం రవి, కాంగ్రెస్ నేతలంతా గద్దర్ కుటుంబ సభ్యుల వెంటే ఉన్నారు.
ఇక సోనియా గాంధీ ,రాహుల్ గాంధీ, ప్రియంక గాంధీలు సైతం గద్దర్‌కు సంతాపం ప్రకటించారు. అయితే గద్దర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. కాంగ్రెస్ కోసం ప్రచారం చేసిన భావజాలం కూడా కాదు. గద్దర్‌కే సొంత రాజకీయ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ గద్దర్ ఎన్నో పాటలు కూడా పాడిన సందర్బాలున్నాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రం గద్దర్‌ను సొంత పార్టీ మనిషిలా చూస్తోందని, ఇది కాంగ్రెస్ రాజకీయ వ్యూహంలో భాగమని ప్రచారం జోరుగా సాగుతోంది.
అలాగే ఇటీవల రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతున్న సమయంలో గద్దర్ సైతం పాల్గొన్న సందర్భాలున్నాయి. రాహుల్, ప్రియాంక గాంధీలు తెలంగాణ లో పర్యటించిన ప్రతి సారి గద్దర్ ఆయా సభల్లో పాల్గొంటూ వచ్చారు. కాంగ్రెస్ పోరాటాలకు బాసటగా నిలుస్తున్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు కాంగ్రెస్‌తోనే ఓటమి తప్పదని బలంగా నమ్మేవారు గద్దర్. అందుకే ఎక్కడ కాంగ్రెస్ సభలు నిర్వహించినా అక్కడ గద్దర్ ఉండేవారు. సీఎల్పీ నేత బట్టి పాదయాత్రలో సైతం గద్దర్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గద్దర్, కాంగ్రెస్ మధ్య అనుంబంధం ఏర్పడింది. మరో వైపు గద్దర్ కుమారుడు సూర్య గత ఎన్నికలప్పుడు కాంగ్రెలో చేరారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఒక అసెంబ్లీ సీటు టికెట్‌కు ఆయనకు దాదాపు ఖరారు చేశారు. కానీ అది చివరి నిముషంలో మార్పులు జరిగాయి. పెద్దపల్లి సీటు నుంచి ఎంపీగా టికెట్ కోసం ప్రయత్నించినా ఫలించలేదు.
రాబోయే ఎన్నికల్లో గద్దర్ కుమారుడు సూర్యకు కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెట్ కానీ, పెద్దపల్లి పార్లమెంట్ సీటు కానీ కాంగ్రెస్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు సమాచారం. గద్దర్ మంచి స్వభావం ఉన్న వ్యక్తి అని, అందుకే ఆయన లేకున్నా.. కుమారునికి టికెట్ ఇచ్చి అండగా నిలువాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని కాంగ్రెస్ వర్గీయుల ద్వారా సమాచారం. మరి గద్దర్ కుమారునికి టికెట్ ఇచ్చి గెలిపించుకునేందుకు కృషి చేస్తారా..? లేదా అన్నది వేచి చూడాలి.