షర్మిల అనుకున్నదే జరుగుతుందా

తెలంగాణ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. అయితే ఇప్పుడు అందరి చూపు పాలేరు పైనే ఉంది.

Update: 2023-09-21 05:43 GMT

తెలంగాణ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. అయితే ఇప్పుడు అందరి చూపు పాలేరు పైనే ఉంది. పాలేరు నుంచి ఎవరెవరు బరిలోకి దిగుతారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. పాలేరు నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్రంలో కెల్లా హాట్ టాపిక్ గా మారింది. మామూలుగా అయితే పాలేరు నియోజకవర్గాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ అక్కడ పోటీ ఎక్కువగా ఉండటం. హేమాహేమీలు తలపడటంతోనే అందరి నోళ్లతోనూ పాలేరు నానుతోంది. ఇంతకీ పాలేరు నియోజకవర్గం ప్రజలు ఎవరిని ఆదరిస్తారు? అనే కంటే ముందు అక్కడ ఎవరెవరు పోటీ చేస్తారన్నది మాత్రం ఇంట్రెస్ట్‌గా ఉంది. అందుకే అన్ని పార్టీల ముఖ్య నేతలు పాలేరు వైపు చూస్తున్నారు.

ట్రాక్ రికార్డు చూస్తే…
పాలేరు నియోజకవర్గం చరిత్ర ఒకసారి చూస్తే ఎక్కువగా కాంగ్రెస్‌కే అనుకూలంగా ఉందని చెప్పాలి. అనేక ఎన్నికల్లో ఇదే విషయం స్పష్టమయింది. 1994లో సీపీఎం, 2016 ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ మినహా మిగిలిన అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులే ఇక్కడి నుంచి విజయం సాధించారు. ఇక్కడ రెడ్డి సామాజికవర్గంతో పాటు బీసీ, ఎస్సీ ఓటర్లు కూడా ఎక్కువగా ఉన్నారు. ఇప్పటి వరకూ ట్రాక్ రికార్డు కాంగ్రెస్ వైపు మాత్రమే ఉంది. 2018 ఎన్నికల్లోనూ కందాల ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగానే గెలిచి తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు.
తుమ్మల చేరడంతో…
ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉపేందర్ రెడ్డి పేరును గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. దీంతో ఆ టిక్కెట్ ఆశించిన తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ లో ప్రధాన వర్గం ఆయనకు పాలేరు టిక్కెట్ ఇచ్చేందుకు సుముఖంగా ఉంది. ఆయన పాలేరు టిక్కెట్ ఆశించి మాత్రమే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. దాదాపు తుమ్మలకే పాలేరు సీటు కన్ఫర్మ్ అయినట్లు అనుకోవాల్సి ఉంటుంది. అంతే అనధికాారికంగా అయినప్పటికీ తుమ్మల కాంగ్రెస్ అభ్యర్థి అని క్యాడర్ కూడా భావిస్తుంది. ఆయన కూడా పాలేరు నియోజకవర్గంలోని తన అనుచరులతో ఆయన సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించడం ఇందుకు కారణంగా చూడాల్సి ఉండాలి.
షర్మిల ఏం చేయబోతుంది?
అదే సమయంలో వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల కూడా పాలేరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. పార్టీ తరుపున ఆమె కార్యాలయాన్ని కూడా పాలేరులో ప్రారంభించుకున్నారు. తాను పాలేరు నుంచి పోటీ చేస్తానని కూడా చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఇప్పుడు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావిస్తున్నారు. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఢిల్లీకి వెళ్లి సోనియా, రాహుల్ గాంధీని కూడా కలసి వచ్చారు. కానీ తుమ్మల చేరడంతో షర్మిల హస్తం పార్టీ చేరిక వాయిదా పడిందనే అనుకోవాలి. తుమ్మలను కాంగ్రెస్ లోకి తీసుకున్నందుకు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పట్ల తన ఆలోచనను పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
పాలేరు నుంచే...
అయితే కాంగ్రెస్ అధినాయకత్వం షర్మిలకు కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపుతామని కూడా హామీ ఇచ్చిందంటున్నారు. కానీ షర్మిలకు మాత్రం తెలంగాణ అసెంబ్లీ నుంచే తాను రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నారు. పాలేరు నుంచే షర్మిల బరిలోకి దిగాలన్న గట్టి నిర్ణయంతో ఉన్నారు. వైఎస్సార్టీపీ తరుపునే పోటీ చేసి గెలిచి తాను శాసనసభలోకి అడుగుపెట్టాలన్నదే షర్మిల ఆలోచన. ఆ దిశగానే ఆమె ప్రయత్నాలు సాగుతున్నాయి. తాజాగా పాలేరు నియోజకవర్గం పార్టీ నేతలతో సమావేశం కూడా ఇందుకు అద్దం పడుతుంది. మరి చివరకు ఏం జరుగుతుందో తెలియదు కానీ మొత్తానికి పాలేరు ఎన్నికలు మాత్రం హీట్ పెంచిందనే చెప్పాలి.


Tags:    

Similar News