Konda Surekha : నువ్వు రావాలమ్మా.. గేమ్ ఛేంజర్ గా మారాలమ్మా

తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారం చేస్తామని ప్రకటించారు.

Update: 2024-01-30 12:29 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పటికే హీటెక్కాయి. మరింత వేడి పెంచడానికి తాము కూడా ఏపీలో ఎన్నికల ప్రచారానికి వస్తామంటూ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. అసలే వైఎస్ జగన్ తనపై దుష్టచతుష్టయం దాడి చేస్తుందని, వచ్చే ఎన్నికల కురుక్షేత్రంలో తాను అభిమన్యుడిని కాబోనని, అర్జునుడి నంటూ ప్రజల్లో సానుభూతిని నింపే ప్రయత్నం చేస్తున్నారు. తనపై అందరూ ఒక్కటై కలసి కట్టుగా ఎదుర్కొనడానికి మూకుమ్మడిగా వస్తున్నారంటూ జగన్ చేస్తున్న ప్రచారం ఇప్పటికే జనంలోకి వెళ్లింది. దీంతో పాటు తాను చేసిన మంచి పనులను చూసి మాత్రమే ఓటు వేయాలని కూడా కోరుతున్నారు. ఇటీవల భీమిలీలో యుద్ధానికి సిద్ధం అంటూ సవాల్ కూడా విసిరారు.

అందరూ ఏకమవుతున్నారంటూ...
ఒకవైపు చంద్రబాబు, మరొక వైపు పవన్ కల్యాణ్.. ఇంకో వైపు వైఎస్ షర్మిల ఇలా జగన్ ను చుట్టుముడుతున్నారని వైసీపీ సోషల్ మీడియాలో ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. తమ నేతను ఎదుర్కొనడానికి అందరూ ఒక్కటై ప్రజలను మభ్యపెడుతూ వస్తున్నారంటూ నెట్టింట పెద్దయెత్తున ప్రచారం కూడా జరుగుతుంది. ఒక్క జగన్ ను ఎదుర్కొనడానికి ఇంతమంది ఏకమవ్వాలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదంతా ప్రజల నుంచి సింపతీని గెయిన్ చేసుకోవడేమనన్న సంగతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. రాజకీయాలంటే ఎవరు ఎవరితోనైనా కలవచ్చు. ఎవరైనా విమర్శలు చేయవచ్చు. అంతే కాని తనను ఓడించడానికి ఏకమవుతున్నారని చెప్పడమూ పాలిటిక్స్ లో కరెక్ట్ కాదు.
వైఎస్ షర్మిలతోనే...
ఎందుకంటే రాజకీయాలంటేనే గెలుపు.. ఓటములు రెండే ఉంటాయి. అందులోనూ ఎవరికి ఎన్ని సీట్లు ఎక్కువ వస్తే... అది మ్యాజిక్ ఫిగర్ కు చేరుకుంటేనే అధికారం దక్కుతుంది. లేదంటే ప్రతిపక్షంలో కూర్చోవాల్సి ఉంటుంది. పాలిటిక్స్ అన్నాక ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి. ఏ కాంబినేషన్ లో తాము వస్తే జనాలను ఆకట్టుకోవచ్చో.. ప్రజలను తమ వైపు తిప్పుకోవచ్చో పార్టీ అధినేతలు వ్యూహాలను రచించుకుంటారు. అందులో భాగంగానే జనసేన, టీడీపీ కూటమిగా ఏర్పడింది. రేపటి రోజున ఆ కూటమిలో బీజేపీ కూడా చేరొచ్చు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ చీఫ్ గా ఎన్నికై తన ఓట్లు చీల్చడానికే వస్తున్నారని అనడం కూడా అవివేకమే అవుతుంది. ప్రజలు ఏది బడితే అది నమ్మరు.
తెలంగాణ నేతలు...
ఇప్పుడు తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా ఏపీలో తాము ప్రచారం చేస్తామంటూ ముందుకొస్తున్నారు. వైఎస్ మంత్రివర్గంలో కీలకంగా ఉన్న కొండా సురేఖ ఏపీలో తాను కాంగ్రెస్ కు మద్దతుగా ప్రచారం చేస్తానని చెబుతున్నారు. అదే జరిగితే జగన్ నెత్తిన పాలు పోసినట్లేనని అంటున్నారు ఆయన పార్టీ నేతలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబుకు పరోక్షంగా సహకారం అందించేందుకు పొరుగు రాష్ట్రం నుంచి మంత్రులను కూడా పంపుతున్నారంటూ మరింత సానుభూతిని ఫ్యాన్ పార్టీ మూటకట్టుకునే అవకాశముంది. అందుకే నువ్వు రావాలమ్మా అంటూ సెటైరికల్ గా సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలే కొండా సురేఖను ఏపీ ఎన్నికల ప్రచారంలోకి స్వాగతిస్తున్నారు. కొండా సురేఖ జగన్ పై ఎన్ని విమర్శలు చేస్తే అంత మంచిదని వారు భావిస్తుండటం విశేషం. కొండా సురేఖ వచ్చి ఇక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే కొద్దోగొప్పో జగన్ పై ఉన్న వ్యతిరేకత మాయమవ్వడం ఖాయమని అంటున్నారు.


Tags:    

Similar News