Chandrababu : ఆ ఐదు కుటుంబాలకు షాకిచ్చిన చంద్రబాబు... నేనేమీ చేయలేనంటూ సంకేతాలు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక కుటుంబానికి ఒకే టిక్కెట్ అని గట్ట ిసంకేతాలు ఇచ్చారు

Update: 2024-02-10 06:04 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక కుటుంబానికి ఒకే టిక్కెట్ అని గట్ట ిసంకేతాలు ఇచ్చారు. ఇందులో ఒకే కుటుంబానికి మాత్రం మినహాయింపు ఇచ్చారు. కింజారపు కుటుంబానికి ఒక్కరినే మినహాయిస్తూ మిగిలిన వారికి మాత్రం ఒక కుటుంబానికి ఒకే సీటు అంటూ క్లారిటీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పొత్తులు కుదురుతున్న నేపథ్యంలో కుటుంబాలలోని సభ్యులకు కాకుండా కొత్తవారికి అవకాశమిచ్చేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. అందుకు సీనియర్ నేతలు కూడా తనకు సహకరించాలంటూ ఆయన ఇప్పటికే కొందరికి చెప్పినట్లు తెలసింది.

కొత్త వారికి అవకాశమివ్వాలని...
జగన్ ను ఈ ఎన్నికల్లో ఓడించాలంటే కొందరు త్యాగాలు చేయక తప్పదని అందులో ముఖ్యంగా సీనియర్ నేతలు కొన్ని కుటుంబాల వారు తన నిర్ణయానికి మద్దతు పలకాలని ఆయన ప్రత్యేకంగా కోరినట్లు చెబుతున్నారు. పార్టీ అధికారంలో లేనప్పుడు, కష్టకాలంలో అండగా ఉన్నప్పటికీ కొత్త వారికి అవకాశమిస్తే గెలుపు అవకాశాలు ఉంటాయని, లేకుంటే చేజేతులా మళ్లీ కొన్ని స్థానాలను కోల్పోవాల్సి వస్తుందని ఆయన పార్టీ సీనియర్ నేతలతో అన్నట్లు సమాచారం. అందుకే దాదాపు ఆరు కుటుంబాలకు ఒకే టిక్కెట్ అని చెప్పేశారు. అందులో ఏ టిక్కెట్ కావాలో మీరే నిర్ణయించుకోవాలని కూడా కొందరితో అన్నట్లు తెలిసింది. కొత్త వారికి అవకాశమిస్తే ఓట్లు కూడా పెరుగుతాయని ఆయన భావిస్తున్నారు.
ఈ కుటుంబాలకు...
పరిటాల కుటుంబం రాప్తాడు, ధర్మవరం టిక్కెట్లు అడుగుతుంది. అయితే ఈసారి రాప్తాడు నుంచి సునీతకు మాత్రమే అవకాశమివ్వనున్నారు. జేసీ కుటుంబం కూడా రెండు స్థానాలను కోరుకుంటుంది. అనంతపురం పార్లమెంటు పవన్ రెడ్డికి, తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం జేసీ అస్మిత్ రెడ్డికి కావాలని కోరుతుంది. కానీ తాడిపత్రి టిక్కెట్ మాత్రమే వారికి ఇవ్వనున్నారు. మరో వైపు కేఈ కృష్ణమూర్తి కుటుంబం పత్తికొండ, డోన్ టిక్కెట్లను ఆశిస్తుంది. పత్తి కొండ నుంచి కేఈ శ్యాంబాబు, డోన్ నుంచి కేఈ ప్రభాకర్ పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ కేఈ శ్యాంబాబు ఒక్కరికే టిక్కెట్ ను చంద్రబాబు కన్ఫర్మ్ చేయనున్నారు.
వీరిలో ఒకరికే...
ఇక ఉత్తరాంధ్రలో పూసపాటి అశోక్ గజపతిరాజు విజయనగరం పార్లమెంటు సభ్యుడిగా, ఆయన కుమార్తె ఆదితి విజయలక్ష్మికి ఇవ్వాలని కోరుతున్నారు. కానీ అశోక్ గజపతిరాజుకు మాత్రమే విజయనగరం పార్లమెంటు టిక్కెట్ ఇవ్వనున్నారు. ఇక చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా తనకు నర్సీపట్నం, తన కుమారుడు విజయ్ పాత్రుడుకు అనకాపల్లి పార్లమెంటు టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. కానీ అయ్యన్నపాత్రుడు ఒక్కరికే టిక్కెట్ ఖరారు చేయనున్నారు. కానీ అదే సమయంలో టెక్కలి నుంచి అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎంపీగా కింజారపు రామ్మోహన్ నాయుడులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఇలా సీనియర్ నేతలకు మాత్రమే కాకుండా ఫ్యామిలీ ప్యాక్ లేదని, పొత్తుల కారణంగా కొన్ని స్థానాలను మిత్రపక్షాలకు, మరికొన్ని స్థానాల్లో కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్నది చంద్రబాబు నిర్ణయం. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.


Tags:    

Similar News