కరివేపాకులే గా
రాజకీయాల్లో ఎవరికైనా గెలుపు ముఖ్యం. అధికారమే అంతిమ లక్ష్యం. అందుకు ఎలాంటి నిర్ణయాలైనా తీసుకుంటారు
రాజకీయాల్లో ఎవరికైనా గెలుపు ముఖ్యం. అధికారమే అంతిమ లక్ష్యం. అందుకు ఎలాంటి నిర్ణయాలైనా తీసుకుంటారు. తమ పార్టీ అభ్యర్థులు సులువుగా గెలిచేందుకు అనేక కారణాలు దోహదపడతాయి. చివరకు అధికారంలోకి వస్తే ఐదేళ్లు పాలన సజావుగా సాగేందుకు తమ పార్టీ శాసనసభ్యులే ఎక్కువ మంది ఉంటారనుకుంటారు. ఇది ఏ పార్టీలోనైనా సహజం. పొత్తులతో వెళ్లినా ఎక్కువ స్థానాలను మిత్రులకు ఇచ్చి తమ పార్టీని నియోజకవర్గాల్లో క్యాడర్ ను, నేతలను నిరాశపర్చలేరు. నీరు గార్చలేరు కూడా. అందుకే సాధ్యమయినంత వరకూ ఒంటరిగానే గెలవాలని కోరుకుంటారు. అలాగే ఇప్పుడు వామపక్షాల పరిస్థితి రెండు రాష్ట్రాల్లో అదే విధంగా మారింది. తెలంగాణలో కేసీఆర్ వారిని కాదని ఒంటరిగానే బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు.
ఏపీలో మాత్రం…
రాష్ట్ర విభజన తర్వాత కొద్దో గొప్పో తెలంగాణలో కొంత ప్రభావం చూపి శాసనసభలోకి కాలుమోపిన కామ్రేడ్లు ఏపీ శాసనసభలోకి మాత్రం అడుగుపెట్టలేకపోయారు. పదేళ్ల తర్వాతనైనా కాలు మోపాలని వామపక్ష పార్టీలు తెగ ఆరాటపడుతున్నాయి. 2019 ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకున్నప్పటికీ వారి ఆశలు ఫలించలేదు. దీంతో 2024 ఎన్నికల్లోనైనా టీడీపీతో పొత్తు కుదురుతుందని ఆశపడ్డారు.అందుకే అధికారపార్టీకి వ్యతిరేకంగా 2020 నాటి నుంచే సైకిల్ పార్టీతో కలసి నడిచారు. అమరావతి ఉద్యమం నుంచి అన్ని పోరాటాల వరకూ పసుపు పార్టీకి ఎర్రజెండాలను కట్టి అండగా నిలిచారు. కానీ చంద్రబాబు గత కొంతకాలంగా బీజేపీతో సయోధ్యత కోసం ప్రయత్నిస్తున్నారు. కమలం పార్టీతో జట్టు కుదిరితే వామపక్షాలు ఎటూ కలవవు. ఒకవేళ ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరకుంటే తాము టీడీపీతో కలసి పోటీ చేయవచ్చని బలంగా నమ్ముతున్నారు.
ఏపీలోనూ…
కానీ కమ్యునిస్టులను దగ్గరకు రానిచ్చే పరిస్థితులు ఏపీలో కూడా కన్పించడం లేదు. ఒకవేళ బీజేపీతో పొత్తు కుదరకపోయినా టీడీపీ, జనసేనలు మాత్రమే కలసి పోటీ చేస్తాయి తప్పించి కమ్యునిస్టులను కలుపుకుని వెళ్లే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుడదని భావించే టీడీపీ కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం వారు పోటీకి దిగితే తమకే లాభమన్న అంచనాలో ఉన్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో కామ్రేడ్లు బరిలోకి దిగితేనే తమ పార్టీ అభ్యర్థులు బయటపడతారన్న సర్వేనివేదికల అంచనాలతో ఎర్రజెండాలను పక్కన పెట్టాలన్న నిర్ణయానికి చంద్రబాబు కూడా వచ్చినట్లు తెలిసింది. ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది అనేకంటే తమకే లాభమన్న సర్వే నివేదికలు కామ్రేడ్లను దూరం పెట్టడానికి కారణమని చెబుతున్నారు.
రిజర్వ్ డ్ నియోజకవర్గాల్లో…
ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న నియోజకవర్గాలతో పాటు ఎస్టీ, ఎస్.సి. నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో టీడీపీ ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం మినహా ఎక్కడా గెలుచుకోలేకపోయింది. అన్ని నియోజకవర్గాల్లోనూ వైసీపీ సత్తా చాటింది. ఈసారి ఎలాగైనా ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో పసుపు జెండా ఎగరేయాలన్న లక్ష్యంతో చంద్రబాబు ముందు నుంచే తన స్ట్రాటజీని వర్క్ అవుట్ చేస్తున్నారు. అక్కడ కమ్యునిస్టు పార్టీ అభ్యర్థులు బరిలో ఉంటేనే మంచిదని భావించి కామ్రేడ్లను కలుపుకుని పోయే ప్రయత్నం చేయరన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. వారికి నియోజకవర్గాలు కేటాయించి మరోసారి వైసీపీకి పరోక్షంగా సాయం లేదన్న వాదనతో ఆయన కమ్యునిస్టులను కలుపుకుని వెళ్లే అవకాశం లేదు. చివరి నిమిషం వరకూ చెప్పకుండా తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కామ్రేడ్లతో కటీఫ్ చెప్పే ఛాన్సు ఎక్కువగా ఉందన్నది ఖచ్చితమైన సమాచారం.