Maddila Gurumurthy : అలా అసెంబ్లీలోకి అడుగుపెట్టాలనుకుంటే.. ఇలా రివర్స్ అయిందే
తిరుపతి పార్లమెంటు సభ్యుడు మద్దిల గురుమూర్తి ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టాలనుకున్నారు
తిరుపతి పార్లమెంటు సభ్యుడు మద్దిల గురుమూర్తి ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టాలనుకున్నారు. కానీ ఆయన ఆశలు గల్లంతయ్యాయి. ఐదో జాబితాలో ఆయన పేరు మళ్లీ రివర్స్ అయింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మద్దిల గురుమూర్తి వైసీపీ నుంచి పోటీ చేసి తిరుపతి పార్లమెంటు సభ్యుడిగా విజయం సాధించారు. ఆయన అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చి ఏకంగా పార్లమెంటులోకి అడుగు పెట్టారు. ఒకరకంగా అనుకోకుండా లభించిన అదృష్టంగానే భావించాలి. ఎందుకంటే ఎవరూ ఊహించని పదవి ఆయనకు రావడం అంటే ఆషామాషీ కాదు. జగన్ దృష్టిలో పడటమే ఆయనకు ప్లస్ అయింది.
పాదయాత్ర సమయంలో...
2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆయనకు వైద్యుడిగా గురుమూర్తి వ్యవహరించారు. ఆయన పక్కనే ఉండి వైద్య సేవలందించారు. అలాంటి గురుమూర్తికి 2021లో వైసీీపీ నుంచి తిరుపతి పార్లమెంటు అభ్యర్థిగా ఎంపిక చేశామన్న ప్రకటన తెలియడంతో ఆయనే ఆశ్చర్యపోయారు. అప్పటి వైసీీపీ సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో గురుమూర్తిని ఎంపిక జగన్ అభ్యర్థిగా ఎంపిక చేశారు. తనకేంటి? ఎంపీ పదవేంటి? అంటూ ఆయన ఒకింత భయపడ్డారు కూడా. అతి చిన్న వయసులో ఎంపీ అయ్యారు. ఫిజియోథెరపిస్టు కావడంతో జగన్ పాదయాత్ర చేస్తున్నప్పడు ఆయనకు దగ్గరుండి వైద్య సేవలందించిన గురుమూర్తిని చివరకు జగన్ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక చేయడం అప్పట్లో పార్టీలో కూడా చర్చనీయాంశమైంది.
శాసనసభకు పంపాలని...
అలాంటి మద్దిల గురుమూర్తి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయిన తర్వాత పార్టీ కోసం బాగానే పనిచేశారు. తిరుపతి రైల్వే స్టేషన్, ఎయిర్ పోర్టు అభివృద్ధిపై దృష్టి పెట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులను కేటాయించేలా చేశారు.అయితే మద్దిల గురుమూర్తిని ఈసారి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలని జగన్ నిర్ణయించారు. ఆయనను సత్యవేడు అసెంబ్లీ ఇన్‌ఛార్జిగా నియమించారు. దీంతో మద్దిల గురుమూర్తి మరోసారి ఎగిరి గంతేశారు. పార్లమెంటును చూశానని, ఈసారి అసెంబ్లీలో కూడా అడుగుపెడతానని ఆశించారు. ఆయన సత్యవేడు నియోజకవర్గం ఇన్‌ఛార్జిగా నియమించడం, అక్కడ వైసీపీ ఓటు బ్యాంకు కూడా ఎక్కువగానే ఉండటంతో తన గెలుపు నల్లేరు మీద నడకేనని భావించారు. తాను ఎమ్మెల్యే అయిపోయినట్లేనని అనుకున్నారు. సత్యవేడు నియోజకవర్గంలో ఆయన ఇటీవల పర్యటనలు కూడా చేశారు. పార్టీ కార్యకర్తలను కలిశారు.
ఐదో జాబితాలో...
కానీ ఐదో జాబితాలో ఆయన పేరు మారింది. దీనికి కారణం సత్యవేడు సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ిఇన్‌ఛార్జిగా నియమించారు. కానీ ఆదిమూలం మాత్రం తాను పోట ీచేయనంటే చేయనన్నారు. ఆయన టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. నారా లోకేష్ ను కూడా కలిశారు. నాడు కాంగ్రెస్, నేడు వైసీపీకి మంచి పట్టున్న సీటు. టీడీపీ ఇక్కడ గెలిచి కొన్ని దశాబ్దాలు కావస్తుంది. అందుకే తిరుపతి ఎంపీ సీటు ప్రస్తుతం వైసీపీ అధినాయకత్వం ఇస్తామంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ కోనేటి ఆదిమూలం మాత్రం తనకు ఎంపీ సీటు వద్దు, ఎమ్మెల్సీ సీటు కావాలనే పట్టబట్టడంతో సత్యవేడుకు ఇన్‌ఛార్జిగా నూకతోటి రాజేష్ ను నియమించి, మద్దెల గురుమూర్తిని మళ్లీ తిరుపతి పార్లమెంటుకు పంపారు. దీంతో ఆయన మరోసారి ఎంపీగా పోటీ చేయాల్సిన పరిస్థిితి ఏర్పడింది.