జాతీయ అంశాలపై కేసీఆర్ మౌనం.. వ్యూహం పన్నుతున్నారా?
టీఆర్‌ఎస్‌ని బీఆర్‌ఎస్‌గా మార్చేసి జాతీయ రాజకీయాల్లోకి దూకిన కేసీఆర్.. ఇప్పుడు జాతీయ అంశాలపై మాత్రం పూర్తి మౌనంగా ఉన్నారు.
టీఆర్‌ఎస్‌ని బీఆర్‌ఎస్‌గా మార్చేసి జాతీయ రాజకీయాల్లోకి దూకిన కేసీఆర్.. ఇప్పుడు జాతీయ అంశాలపై మాత్రం పూర్తి మౌనంగా ఉన్నారు. కేంద్రంలోని బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా విపక్ష కూటముల జరుపుతున్న సమావేశాల్లో సైతం పాలు పంచుకోవడం లేదు. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలకు కూడా కేసీఆర్ సపోర్ట్ చేయడం లేదు. కొన్ని రోజులపై బీజేపీపై పోరాడుతున్న నేతలు అందరూ కీలక ప్రకటలు చేస్తున్నా.. కేసీఆర్ మాత్రం నోరు తెరవడం లేదు. చివరికి తన ఢిల్లీ స్నేహితుడు అరవింద్ కేజ్రీవాల్‌కు సమస్య వచ్చినా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఢిల్లీ ప్రభుత్వ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ విపక్షాలు ప్రకటనలు చేస్తున్నారు.
ఈ విషయమై కేజ్రీవాల్‌కు ఇప్పటికే పలు పార్టీలు సంఘీభావం తెలిపాయి. కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌పై పోరాడేందుకు అందరూ కలిసి రావాలని కేజ్రీవాల్ కోరుతున్నారు. అయితే ఈ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ ఒక్క ప్రకటన చేయకపోగా.. కేజ్రీవాల్‌కు సంఘీభావం కూడా తెలుపలేదు. అటు మే 28వ తేదీన ప్రధాని మోదీ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. దీనిపై విపక్ష నేతలు కొన్ని రోజులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించేందుకు అర్హుడు కాదని, రాష్ట్రపతి మాత్రమే పార్లమెంట్ భవన ప్రారంభానికి అర్హులు అని విపక్షాలు చెబుతున్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వ అధినేత మాత్రమేనని, శాసనసభకు అధిపతి కాదని అంటున్నాయి.
ప్రధాని మోదీ సంప్రదాయాలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని, పార్లమెంట్‌ను రాష్ట్రపతి ప్రారంభించాలని కాంగ్రెస్, తృణమూల్, మజ్లిస్ సహా అన్ని విపక్ష పార్టీలు అంటున్నాయి. ఈ విషయంపై కూడా కేసీఆర్ సైలెంట్‌గా ఉన్నారు. మరోవైపు 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల కూటమిని పటిష్టం చేసే పనిలో పడ్డారు బీహా్ సీఎం నితీష్ కుమార్. వరుసగా విపక్ష నేతలతో సమావేశం అవుతున్నారు. అయితే ఆయన కేసీఆర్ కలుస్తానని చెప్పినా.. ఇప్పటి వరకూ కలవలేదు. కేసీఆర్ కూడా కలిసి పని చేద్దామన్న సంకేతాలను పంపడంలేదు. జాతీయ రాజకీయాల్లోకి చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్ ఇప్పుడేందుకు మౌనంగా ఉన్నారు. ఆయనను ప్రధాన ప్రాంతీయ పార్టీలు దూరం పెట్టాయా? లేక ఆయన కావాలనే సైలెంట్‌గా ఉన్నారా? ఎదైనా వ్యూహం ఉందా?.. దీనిపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.